శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదోరోజుకు చేరిన గురుకుల పార్ట్‌టైమ్ ఉద్యోగుల మహా ధర్నా

1 గంట క్రితం

massive
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 11:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వర్షంలోనూ కొనసాగిన నిరసన

- నేటికీ జమకాని జీతాలు

- రేపు కొనసాగనున్న మహాధర్నా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడ ధర్నా చౌక్‌లో బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బంది నిర్వహిస్తున్న మహా ధర్నా శుక్రవారం ఐదో రోజుకు చేరింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగులు మహాధర్నాను కొనసాగించారు. ఈ మహా ధర్నాకు కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షత వహించగ, జైభీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్, మాజీ శాసనమండలి సభ్యులు ఎస్. రామకృష్ణ, విశ్వకళా మండలి రాష్ట్ర అధ్యక్షులు కుటుంబరావు, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఉమామహేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు డి.హారనాధ్, ఎఐసిసిటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్, ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవలింగరాజు తదితరులు హాజరై పార్ట్‌టైమ్ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జైభీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లకు గత కొన్ని నెలలుగా చెల్లించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అమలు చేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తామని హామీ వెంటనే నెరవేర్చాలని కోరారు. ఐదు రోజులుగా విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సంప్రదింపులు జరగకపోవడం విచారకరమన్నారు. కెవిపిఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు బడ్జెట్ కేటాయిస్తున్న ప్రభుత్వం, గురుకులాల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు, మంత్రి హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మహా ధర్నాను కొనసాగిస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ మహాధర్నాలో పార్ట్‌టైమ్ ఉద్యోగుల నాయకులు మున్నెల్లి గురురత్నం, మురగారెడ్డి, యేసోబు, చినబాబు, వర్మ, సునీత, గిరిజా, గోవిందు, శెట్టి శివ, కమలా, అనిల్, శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, ప్రకాష్, ఆహ్వానం, కిషోర్, నాగరాజు, శ్యామ్, విజయ్ కుమార్, వాసుదేవరావు, శ్రీనివాసరావు, ప్రవీణ రెడ్డి, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్