సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌కూటమి అభ్యర్ధులను గెలిపించండి

2 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 08:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రజలకు సిఎం చంద్రబాబు విజ్ఞప్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలే ప్రజల తలరాతలను మారుస్తాయని, మంచి నేతలను ఎన్నుకుని మంచి ప్రభుత్వాలను కొనసాగించుకోవాలని ఆకాంక్షించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించి ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపికలో ఎన్నడూ లేనంత కసరత్తు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు ఒకే తాటిపై ఉంటేనే అభివృద్ధి ముమ్మరంగా సాగుతుందని చెప్పారు. కూటమి పార్టీలది ప్రజాస్వామ్య అజెండా అయితే వైసిపిది హింస విధానమని విమర్శించారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందినా బుద్ది తెచ్చుకోని వైసిపి స్థానిక ఎన్నికల్లోనూ వినాశనానికే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పుడు కూడా వైసిపి అరాచకాలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని విమర్శించారు. తాను చేసిన అవినీతి, అక్రమాల నుంచి రక్షణ పొందేందుకు జగన్‌ జెన్-జీ అంటున్నారని విమర్శించారు. యువతకు ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచన లేకుండా, వారిని పావులుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 20 ఏళ్లు రాష్ట్రానికి చాలా ముఖ్యమని, హింసను అరికట్టి నేరస్థులను దూరంగా పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైసిపి హయాంలో అధికార దుర్వినియోగంతో ఎంపిటిసి స్థానాల్లో 24 శాతం, జెడ్పీటీసీ స్థానాల్లో 19 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.

హామీలు నెరవేరుస్తున్నాం

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సూపర్‌ ‌సిక్స్‌తో పాటు పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. విశాఖ, విజయవాడల్లో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చామని, రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. 2029 నాటికి 36 ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, గోదావరి - కావేరి అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాల నీటి వివాదాలకు చెక్ పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్