- జిఒ 3 రిజర్వేషన్‌కు ప్రత్యామ్నాయమేదీ ?
- కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలయాపనపై ఆదివాసీల్లో ఆగ్రహం
ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి జిల్లా) : ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరగనుంది. ఏజెన్సీలో ఆదివాసీలకు శత శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జిఒ నెంబర్ 3 రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందుకు ప్రత్యామ్నాయ జిఒ తీసుకొస్తామని సిఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఆ హామీ నెరవేరకపోవడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు గత నెలలో అల్లూరి జిల్లా పాడేరు, పోలవరం జిల్లా రంపచోడవరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టారు. పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ గిరిజన యువత కదిలి వచ్చి జిఒ 3 రిజర్వేషన్ అమలు చేయాలని గర్జించింది. గత నెలలో రంపచోడవరం పర్యటనకు వచ్చిన సిఎం చంద్రబాబు జిఒ 3పై స్పందిస్తారని అందరూ ఆశించినా నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆదివాసీ సంఘాలతో పాడేరులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హోం శాఖ మంత్రి అనిత సమావేశం నిర్వహించారు. జిఒ 3 రిజర్వేషన్ సమస్యను పరిష్కరించడానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిని విశ్వసించని ఆదివాసీ సంఘాలు హై పవర్ కమిటీ వద్దని, అది మరొకసారి కాలయాపన కోసమేనని తీవ్రంగా వ్యతిరేకించాయి. నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు హై పవర్ కమిటీ అవసరం లేదని చెప్పాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9)లోపు ఏజెన్సీలో ఆదివాసీలకు శత శాతం ఉద్యోగ రిజర్వేషన్‌పై ప్రత్యామ్నాయ జిఒ జారీ చేయాలని డిమాండ్ చేశాయి. గతంలో జిఒ నెంబర్ 3 ద్వారా ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా లభించాయని, ఆ జిఒ రద్దు కావడంతో 2025 డిఎస్‌సిలో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని గుర్తుచేశాయి. అటువంటి అన్యాయం మరోసారి జరగకుండా చూడాలని సంఘాలన్నీ కోరుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఐదో షెడ్యూల్ ఏరియా ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అల్లూరి ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు, బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆదివాసీ ఉద్యమ నాయకులు తెలిపారు. పెసా గ్రామ సభలను విస్మరించి కార్పొరేట్ కంపెనీలకు దొడ్డిదారిన అనుమతులిస్తూ.. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని ప్రభుత్వమే ఉల్లంఘిస్తోండటంపై వారంతా మండిపడుతున్నారు. ఇలా ఒక్కొక్కటిగా ఆదివాసీల హక్కులను పాలకులు హరించడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఈ బంద్‌కు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాలు సహా ఆదివాసీల నివాస ప్రాంతాల్లో ఈ బంద్ జయప్రదానికి ప్రచారం హోరెత్తింది.








కామెంట్‌లు (0)