శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మన్యం బంద్ ఉద్రిక్తం ..

2 గంటల క్రితం

బస్సులను అడ్డుకుంటున్న ఆందోళనకారులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 08:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • భారీగా మోహరించిన పోలీసులు..

  • బస్సులు, ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్న బంద్ నిర్వాహకులు

ప్రజాశక్తి-పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్ర మన్యం బంద్ పిలుపుతో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు పలు ఆదివాసీ సంఘాల నాయకులు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. పాడేరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద బంద్ నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జీవో 3 రిజర్వేషన్‌కు ప్రత్యామ్నాయ జీవోను వెంటనే జారీ చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించి పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బంద్ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. రోడ్డుపై బైఠాయించిన బంద్ నిర్వాహకులను పోలీసులు పక్కకు తప్పించి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను పంపించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ నిర్వాహకుల కంటే పోలీసులు అధిక సంఖ్యలో మోహరించి బస్సులు, వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ప్రయాణికులు లేకపోవడంతో కొన్ని ఆర్టీసీ బస్సులు ఖాళీగానే వెళ్లాయి.

మూతపడిన దుకాణాలు.. నిలిచిన ప్రైవేట్ రవాణా

బంద్ ప్రభావంతో పలు షాపులు, దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, ఆటోలు, జీపులు నిలిచిపోయాయి. దీంతో పట్టణంలో సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని పలు మండలాల్లోనూ బంద్ కొనసాగుతోంది. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలతో పాటు అరకు లోయ, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బంద్ నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. బంద్ కార్యక్రమంలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పలనరస, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మన్నపడాల్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు కాంగు చిన్ని శుభ, మహిళా సంఘం జిల్లా నాయకురాలు కిలో విమల, బాలకృష్ణ, ఆదివాసీ సేన జిల్లా నాయకులు రాజ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు చిన్నారావు, నిరుద్యోగుల సంఘం జిల్లా నాయకులు భాను, సీహెచ్ రావు, రమేష్, పంగి రామారావు, కార్మిక సంఘం జిల్లా నాయకులు లింగేరి సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

62eb105a-791b-46c1-80dd-660534c5ec75.jpeg

paderu 2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్