ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టణ మౌలిక సదుపాయాలకు మార్కెట్‌ రుణాలు

2 గంటల క్రితం

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.1122 కోట్ల బాండ్లుకు ఆమోదం

- తిరిగి చెల్లింపు బాధ్యత స్థానిక సంస్థలదే

- మర్చంట్‌ బ్యాంకర్‌ ఎంపికకు కమిటీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అర్బన్‌ ‌లోకల్‌ ‌బాడీల్లో మౌలిక సదుపాయాల ఆర్థిక సహాయం కోసం 'పూల్డ్ మున్సిపల్ బాండ్ జారీ ఫ్రేమ్‌వర్క్' ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. బాండ్ల ద్వారా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే బాధ్యతను స్థానిక సంస్థలే చూసుకోవాలని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష లేదా పరోక్ష బాధ్యతగా భావించొద్దనీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం బాండ్ల ద్వారా తీసుకునే అప్పును తీర్చే బాధ్యతను స్థానిక సంస్థలే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పరోక్షంగా పట్టణ ప్రజల నుండి దాన్ని ముక్కుపిండి వసూలు చేయాల్సి ఉంటుంది. పట్టణ స్థానిక సంస్థలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అదనపు ఆర్థిక వనరులను సమీకరించడానికి ప్రభుత్వం మార్కెట్ ఆధారిత ఆర్థిక సహాయ విధానాలను అన్వేషిస్తోందని తెలిపింది. ఈ మేరకు పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌‌కుమార్‌ ‌ఛైర్మన్‌‌గా ఐదుగురు సభ్యులతో స్క్రీనింగ్‌ ‌కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు విధివిధానాలు వివరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విధివిధానాలను రూపొందించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ‌ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌ ‌కార్పొరేషన్‌(ఎపియుఎఫ్‌ఐడిసి)కు అప్పగించింది. పూల్డ్ మున్సిపల్ బాండ్లతో సహా మార్కెట్ ఆధారిత ఆర్థిక విధానాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని అమలు చేయడానికి 'ట్రాన్సాక్షన్ అడ్వైజర్'గా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ను(ఎపిఐఎఎంఎల్‌) ‌నియమించింది. దీని ప్రకారం ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థలలో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడానికి, పూల్డ్ మున్సిపల్ బాండ్ల ద్వారా సుమారు రూ. 1,010.58 కోట్లు సమీకరించాలని పేర్కొంటూ "ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ మౌలిక సదుపాయాల ఆర్థిక సహాయం కోసం పూల్డ్ మున్సిపల్ బాండ్ జారీ ఫ్రేమ్‌వర్క్" పేరుతో ప్రతిపాదనను సమర్పించింది. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 1,122.86 కోట్లుగా పేర్కొంటూ బాండ్ల ద్వారా రూ.1,010.58 కోట్లు, ఈక్విటీ రూ.112.29 కోట్లుగా తెలిపింది. దీన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీనికోసం అవసరమైన మర్చంట్ బ్యాంకర్ ఎంపిక కోసం స్క్రీనింగ్‌ ‌కమిటీని నియమించినట్లు అందులో పేర్కొంది. పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌‌గా ఉంటే ఈ కమిటీలో ఆర్థికశాఖ కార్యదర్శి, పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్, ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి, ఎపిపిఎఫ్‌‌సి సూచించిన ఒకరు సభ్యులుగా ఉంటారు. దీనికి అంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌ అసెట్స్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ ‌లిమిటెడ్‌(ఎపియుఐఎఎంఎల్‌) ‌సహకరిస్స్తుందని తెలిపింది. దీనికిగాను బాండ్ల జారీ తరువాత సమీకరించిన మొత్తంలో (0.5) శాతం ఎపియుఐఎఎంఎల్‌కు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. మర్చంట్‌ ‌బ్యాంకర్‌‌ను నియమించడానికి ముందే మొత్తం డాక్యుమెంట్లను ఎపి అర్బన్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌ఫండ్‌(ఎపియుడిఎఫ్‌) ‌ఆమోదించాల్సి ఉంటుందని తెలిపింది. బాండ్ల జారీకి ముందే అన్ని పట్టణ సంస్థల క్రెడిట్‌ ‌రేటింగ్‌ను పూర్తి చేయాలనీ జిఓలో పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థల ఆదాయం, క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేయడానికి, బాండ్ జారీ ప్రారంభానికి ముందే భాగస్వామ్య పట్టణ స్థానిక సంస్థల నుండి ఆదాయాన్ని ఆర్జించే మున్సిపల్ ఆస్తులను చేర్చడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికను అంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌ అసెట్స్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ ‌లిమిటెడ్‌ సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు. కూపన్ చెల్లింపులు, అసలు తిరిగి చెల్లింపు, ట్రస్టీ బాధ్యతలు అన్ని అనుబంధ అప్పులతో సహా మొత్తం రుణ బాధ్యతను పూర్తిగా భాగస్వామ్య పట్టణ స్థానిక సంస్థలు నిర్దేశిత రుణ గ్రహీత సంస్థలపై మాత్రమే ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ప్రత్యక్ష లేదా పరోక్ష బాధ్యతను లేదా ఆర్థిక భారాన్ని సృష్టించినట్లుగా భావించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్