ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రామ్‌దేవ్ నిర్వహించిన యోగసాధనను తిలకించిన సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యోగా సాధనతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాబా రామ్ దేవ్ నేతృత్వంలో ఉండవల్లిలో జరిగిన యోగభ్యాసాన్ని చంద్రబాబు శనివారం తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శరీరం, మెదడు అనుసంధానం అవుతాయని చెప్పారు. మన సంస్కృతి, విలువలే భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురు స్థానంలో నిలిపాయని చెప్పారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సంస్కృతి, విలువలను కాపాడుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తాను 30 ఏళ్ల నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని, రామ్ దేవ్ యోగాను ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ వ్యసనం కాకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక, యోగా వంటివి ఉపకరిస్తాయని చెప్పారు. యోగా సాధన కోసం ఉద్యమ స్పూర్తితో పని చేయాలని, ప్రస్తుత తరానికి దీనిని అలవాటు చేస్తే అద్భుతమైన భవిష్యత్తును అందించినట్లు అవుతుందన్నారు. ఆధ్యాత్మికతో కూడిన వికసిత్ భారత్ సాధించాలని ప్రయత్నిస్తున్న ప్రధాన మంత్రికి సహకరిద్దామని కోరారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నామని, 20 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారని చెప్పారు. ప్రజా రోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇందులో యోగాసాధన, ప్రాణామయం వంటివి కూడా చేరుస్తున్నామని వెల్లడించారు.రాజధాని ప్రాంతంలో అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు, పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. రామ్‌దేవ్ మాట్లాడుతూ యోగా దేశానికి గర్వకారణం అని అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని తతెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహా వివిధ శాఖల ఉసహా న్నతాధికారులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)