సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచదార్ల కొండపై మైనింగ్‌.. పూర్తి వివరాలివ్వండి

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 01:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండపై మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతుల వ్యవహారంలో పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, గనులశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పంచదార్ల కొండ వద్ద మైనింగ్‌ లీజుల మంజూరును సవాల్‌ చేస్తూ అప్పారాయుడుపాలెం గ్రామానికి చెందిన ఉప్పులూరి నాయుడు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. విజయ్‌కుమార్‌ నాయుడు, రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీలక్ష్మి నరసింహ మినరల్స్‌ సంస్థలకు మంజూరు చేసిన మైనింగ్‌ లీజులను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదిస్తూ.. పంచదార్ల కొండపై పురాతన శివాలయం ఉందని, ఆ ప్రాంతాన్ని రక్షిత జోన్‌గా ప్రకటించారని తెలిపారు. ఆలయానికి కిలోమీటర్‌ పరిధిలో మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతించడానికి వీల్లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరపున గవర్నమెంట్‌ స్పెషల్‌ అడ్వకేట్‌ ఎస్‌ ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పంచదార్ల కొండ ప్రాంతంలో 2,153 హెక్టార్ల పరిధిలో మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపేశామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసిందని వివరించారు. దీనిపై పిటిషనర్‌ తరపున న్యాయవాది స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో మూడు మైనింగ్‌ లీజులు మంజూరు కాగా, ఒకటి సిట్టింగ్‌ ఎంపి పేరు మీద, మరొకటి ఆయన డ్రైవర్‌ పేరుతో, ఇంకొకటి వేరే వ్యక్తి పేరుతో ఉన్నాయని తెలిపారు. వాటిలో ప్రస్తుతం ఒక్క లీజును మాత్రమే రద్దు చేశారని, ఇంకా మైనింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వాదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్