- ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలను రాష్ర్ట మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. న్యూఢిల్లీలో ‘పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా’ సంస్థ గురువారం నిర్వహించిన సదస్సులో వివిధ రంగాల్లోని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నారా లోకేష్ కూడా హాజరై కంపెనీల ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆయా కంపెనీలకు వివరించారు.
- అమెరికాకు చెందిన ప్రముఖ మెడికల్ డివైసెస్, డయాగ్నస్టిక్స్, న్యూట్రిషన్, ఫార్మాస్యూటిక్స్ తయారీ సంస్థ అబాట్ (అబాట్) మేనేజింగ్ డైరక్టర్ ఇస్తేయాక్ అంజాద్‌తో భేటీ సందర్భంగా రాష్ర్టంలో వైద్య పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు.
- చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్, యాక్సెసరీస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ తోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఏపిలో మొబైల్ కాంపొనెంట్స్ తయారీ పార్కు అభివృద్ధి చేయాలని ఆయనను కోరారు. ఇందుకోసం తిరుపతి అనువైన ప్రదేశమని, అక్కడ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
-జర్మనీకి చెందిన ప్రముఖ ఎంటర్ ప్రైజ్ సాఫ్ట్ వేర్, క్లౌడ్, బిజినెస్ ఎఐ అభివృద్ధి సంస్థ శాప్ (ఎస్ఎపి) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవ్‌నీష్ చనానాతో భేటీ సందర్భంగా రాష్ర్టంలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ తో కలిసి పనిచేయాలని విజ్క్షప్తి చేశారు.
- ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్, టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ (యుఎస్ఎ) ఉపాధ్యక్షులు, గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ అభిషేక్ లాహిరితో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సిస్కో సిస్టమ్స్ (యుఎస్ఎ) మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్‌తో భేటీ సందర్భంగా విశాఖపట్నంలో ఇంజనీరింగ్ సెంటర్/ జిసిసిని ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కోరారు.
- ప్రముఖ క్రాప్ న్యూట్రిషన్, ఫెర్టిజైజర్స్, అమ్మోనియా తయారీ సంస్థ యారా ఇంటర్నేషనల్ ఎఎస్ఎ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ వైశాలి చోప్రాతో లోకేష్ సమావేశమయ్యారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఎపిలో ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, సమాధాన్ కేంద్రాలను విస్తరించడానికి గోద్రెజ్ ఆగ్రోవెట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన..
ఈ సందర్భంగా ‘సర్ణాంధ్ర@2047’ అంశంపై జరిగిన ‘ఫైర్‌సైడ్ చాట్’ కార్యక్రమంలోనూ లోకేష్ ప్రసంగించారు. ఇతర రాష్ట్రాల్లో దశాబ్దానికి పైగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ఏపిలో 18 నెలల్లోపే ప్రారంభించామని ఆయన తెలిపారు. స్పేస్, డ్రోన్లు, సిమెంట్, స్టీల్, మెడికల్ డివైసెస్, ఫార్మా, ఏఐ, డేటా నుంచి హార్టికల్చర్, ఆక్వా రంగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలను కూడా సంప్రదించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టించే లక్ష్యంతో ఏపి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్ ను ప్రారంభిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. దీనితో దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో రానున్నాయని చెప్పారు. వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గోద్రేజ్ సంస్థ నుంచి రాకేష్ స్వామి, ఆర్ మురళీకృష్ణ (సెల్‌కాన్), సునీతా పట్నాయక్ (డిజిఎ గ్రూపు) తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)