- అర్జీల పరిష్కారం కోసం అందుబాటులోకి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: కాగిత రహిత పాలనలో భాగంగా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించే మినిస్టర్స్ మానిటరింగ్ అండ్ యాక్షన్ ట్రాకింగ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ (ఎంఎంఏట్రిక్స్) ఎఐ ఆధారిత పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అర్జీ ఎక్కడ ఉంది, ఎవరి వద్ద ఉంది, ఏ చర్య తీసుకున్నారు, ఇంకా ఏం చేయాలి, ఎప్పటిలోగా పరిష్కరించాలి అనే వివరాలు ఇందులో నమోదవుతాయని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 10 పనిదినాల్లో ప్రక్రియను పూర్తి చేసేలా గడువు నిర్దేశించనున్నారని పేర్కొంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు దీనికి రూపకల్పన చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం వినతుల స్వీకరణ, వాటిపై తీసుకున్న చర్యలు, పరిష్కార స్థితికి సంబంధించిన సమాచారం సంతృప్తికరంగా అందుబాటులో లేకపోవడంతో.. విస్తృత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారని తెలిపింది. ఈ విధానంలో వివిధ వర్గాల వారు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై శాఖపరమైన తీసుకునే చర్యలను నిశితంగా పోర్టల్ ద్వారా మంత్రి, కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, ఇతర హెచ్ఒడిలు ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో తెలుసుకునేలా లాగిన్ సౌకర్యం కల్పించనునట్లు వెల్లడించింది.







కామెంట్లు (0)