- ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని వ్యవహారం
- గుజరాత్ సిఎంకు అనుమతిచ్చి నన్ను అడ్డుకుంటారా?
- రాజకీయ వివక్షను తెలంగాణ సమాజం ఖండించాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా గుజరాత్ కుట్రలు పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డడమేనని విమర్శించారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వడం, తన పర్యటనకు నిరాకరించడం తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఇది స్పష్టంగా రాజకీయ వివక్షని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని విమర్శించారు. దీన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చి తన పర్యటనను ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రం పదే పదే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తుండడం తగదన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు మళ్లించుకొనేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోడీ పార్లమెంట్‌లో తెలంగాణ వ్యతిరేక భావజాలంతో పదేపదే మాట్లాడినా తెలంగాణ బిజెపి నాయకులు స్పందించలేదని విమర్శించారు. గుజరాత్‌ను సమర్ధిస్తున్న తెలంగాణ బిజెపి నాయకులపై సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నరేంద్ర మోడీ, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసల్లా బతకదల్చుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటదల్చుకున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని తెలంగాణ బిజెపి నాయకులను డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
నా విదేశీ పర్యటనలో ఎలాంటి గోప్యతా లేదు
తన విదేశీ పర్యటనలో ఎలాంటి గోప్యతా లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పర్యటనకు దరఖాస్తు చేసినప్పుడు అన్ని విషయాలూ స్పష్టంగా కేంద్ర విదేశాంగ శాఖకు తెలియజేశామని చెప్పారు. ‘విద్య, క్రీడలు, రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికాలో ప్రఖ్యాత యూనివర్సిటీలను, పెట్టుబడిదారులను కలుస్తామని చెప్పాం. యుకె, యుఎస్ పర్యటనకు ఒకే తరహా వివరాలు ఇచ్చాం. నా పర్యటన మొత్తం షెడ్యూల్‌ను విదేశాంగ శాఖ ముందు ఉంచాం. కానీ, రాజకీయ కారణాల వల్ల అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు విదేశాంగ శాఖ బదులిచ్చింది. రాజకీయ కారణం అంటే ఏమిటి? బ్రిటన్ పర్యటనకు ఓకే చెప్పి... అమెరికా పర్యటనను మాత్రం ఎందుకు అడ్డుకున్నారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావడమే కారణమా? ఒక సిఎం విదేశాలకు వెళ్తే విదేశీ రాయబారులు వెంటే ఉంటారు. ప్రతి కార్యక్రమాన్నీ వారు పర్యవేక్షిస్తారు. కేంద్రం నన్ను అడ్డుకున్నా. నా లక్ష్యాన్ని అడ్డుకోలేదు. డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తాం. హైదరాబాద్‌లో పెట్టుబడులకుగల అవకాశాలను వివరిస్తాం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్ర చేస్తోంది. ప్రధాని మోడీ గుజరాత్‌కు బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్‌కు రావాలని మోడీ చూస్తున్నారు. నా పర్యటనను అడ్డుకోవడంపై పార్లమెంటులో లేవనెత్తుతాం. దీన్ని వదిలిపెట్టేది లేదు’ అని పేర్కొన్నారు.
మోడీ పాక్ వెళ్లొచ్చు... మేం అమెరికా వెళ్లకూడదా?
ప్రధానిగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ వెళ్లి ఆయన మిత్రుడితో కలిసి బిర్యానీ తిని రాలేదా? మేము పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లకూడదా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. మోడీ ప్రధాని అయ్యాక ప్రజాస్వామ్యం సన్నగిల్లిందని, నిరంకుశత్వం పెరిగిందని విమర్శించారు. మోడీ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతంగా ఉందని, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయని వివరించారు. బిఆర్‌ఎస్ నేతలు హరీశ్, కెటిఆర్, కవితకు అమెరికా పర్యటన అనుమతులు వస్తున్నాయి కానీ, ముఖ్యమంత్రిగా తన పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వడంలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)