భర్త, అత్తమామలపై ఫిర్యాదు
ప్రజాశక్తి - వినుకొండ (పల్నాడు జిల్లా): తన ఇద్దరు పిల్లలతో తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి ఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. వినుకొండ పట్టణ సిఐ బి ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన నక్క భారతి (26) చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ నాగిరెడ్డి సంరక్షణలో పెరిగారు. 2019లో విఠంరాజుపల్లికి చెందిన సునీల్‌రెడ్డితో ఆమెకు పెళ్లయ్యింది. వారికి తేజస్‌రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి భారతి గదిలో గడిపెట్టుకుందంటూ నాగిరెడ్డికి సునీల్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. భారతి కుటుంబీకులు అక్కడకు వచ్చేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని ఉండగా, పిల్లలిద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. నాగిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు అనుమానస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. భారతిని కొంతకాలంగా భర్త సునీల్‌రెడ్డి, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని, ఇది తట్టుకోలేకే తన మేడకోడలు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని లేదా భర్త, అత్తమామలు కలిసి హత్య చేసి ఉంటారని నాగిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సిఐ ప్రభాకర్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాల శరీర భాగాలపై ఒత్తుకుపోయినట్లు, కమిలినట్లు ఆనవాళ్లను గుర్తించామని, వినుకొండ తహశీల్దార్ సమక్షంలో పంచనామ చేయించామని, వినుకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించామని సిఐ తెలిపారు.








కామెంట్‌లు (0)