ప్రజాశక్తి - ఐ.పోలవరం(డాక్టర్ బిఆర్.అంబేద్కర కోనసీమ జిల్లా) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఆక్వా రైతు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మురమళ్ల గ్రామంలో దాట్ల కృష్ణంరాజు (65) ఆక్వా చెరువులను నిర్వహిస్తున్నారు. రాజవొమ్మంగి మండలం కొయ్యూరుకు చెందిన ఇద్దరు యువకులను, మహిళను చెరువుకు కాపలాదారుగా ఉంచారు. ఎప్పటిలానే కృష్ణంరాజు గురువారం ఉదయం చెరువు వద్దకు వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రొయ్యల చెరువు పరిసరాలను పరిశీలించి, చెరువులో ఉన్న కృష్ణంరాజు మృతదేహాన్ని గుర్తించారు. కృష్ణంరాజును తలపై కొట్టి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని సరిహద్దు రాయికి (సిమెంట్ దిమ్మ) కట్టి చెరువులో పడేసినట్టు గుర్తించారు. కాపలాగా ఉంటున్నవారు అదృశ్యమవ్వడంతో వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ సమీపంలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోగా, మహిళ పరారీలో ఉన్నారు. యువకులు గంజాయి సేవించి ఉన్నారని, చెరువు పనుల విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా భావిస్తున్నామని ఐ.పోలవరం ఎస్ఐ ఎంవివి.రవీంద్రబాబు తెలిపారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్‌పి ఎవిఆర్‌పివి.ప్రసాద్, డిఎస్‌పి టిఎస్ఆర్‌కె.ప్రసాద్, ముమ్మిడివరం సిఐ ఎం.మోహన్‌కుమార్ పరిశీలించారు.
ఆక్వా రైతు దారుణ హత్య
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)