కుటుంబ కలహాలే కారణం?
ప్రజాశక్తి - చీమకుర్తి (ప్రకాశం జిల్లా) : తండ్రి తన ముగ్గురు కుమార్తెలను చంపి తాను కూడా ఉరేసుకునని ఆత్మహత్య చేసుకున్న ఘటన చీమకుర్తి మండలం కెవి అగ్రహారంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కెవి అగ్రహారానికి చెందిన ఏకుల సుధాకర్‌కు ముడుమూరు మండలం సింగన్నపాలెంకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె ఏకుల గోఅచ్యుత (13) బండ్లమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండో కుమార్తె పూజిత (11), చిన్న కుమార్తె లోహిత (8) అగ్రహారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగు, మూడు తరగతులు చదువుతున్నారు. మూడేళ్ల క్రితం సుధాకర్‌కు, ఆయన భార్యకు మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య సింగనపాలెం వెళ్లి.. నివాసం ఉంటున్నారు. సుధాకర్ తన తల్లి, ముగ్గురు కుమార్తెలతో కలిసి అగ్రహారంలోని నివాసముంటున్నారు. సుధాకర్ మిడ్ వేస్ట్ గ్రానైట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒకే మంచంపై నిద్రించిన ముగ్గురు పిల్లలు... ఉదయం మృతిచెంది ఉన్నారు. సుధాకర్ శుక్రవారం ఉదయం ఊరికి దగ్గరలోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా సుధాకర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని, ఈ క్రమంలో సుధాకరే పిల్లలకు విషమిచ్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఒంగోలు డి.ఎస్.పి రావిపాటి శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.









కామెంట్‌లు (0)