శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యావ్యవస్థలో అవినీతిపై గళమెత్తాలి

22 గంటల క్రితం

SFI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 11:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జవాబుదారీతనం కోసమే జంతర్ మంతర్ పోరాటం

  • ‘జెన్ జీ - స్టూడెంట్ పవర్’ సెమినార్‌లో ఐషీ ఘోష్

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : ‘విద్యావ్యవస్థలో అవినీతిపై విద్యార్థులు, యువత గళమెత్తాలని, జంతర్ మంతర్ పోరాటం ఒక్కపరీక్ష కోసమే కాదు, విద్యలో జవాబుదారీతనం కోసం’ అని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి, జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు ఐ‌షీఘోష్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్‌, సావిత్రీబాయి ఫూలే, ఫాతిమా షేక్‌, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని కచ్ఛపి ఆడిటోరియంలో ‘జెన్ జీ - స్టూడెంట్ పవర్’ అంశంపై జిల్లా అధ్యక్షులు పవిత్ర అధ్యక్షతన సెమినార్ జరిగింది. తొలుత ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. జెన్‌ ‌జీ జిందాబాద్, జెన్ అల్ఫా జిందాబాద్, ఎస్ఎఫ్ఐ వర్థిల్లాలి అంటూ నినదించారు. వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐషి ఘోష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ‘మన కోసం మాత్రమే చదువుకుని ఉద్యోగం సంపాదించడం కాదని, మన చుట్టూ ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? విద్యా వ్యవస్థలో ఏం మారాలి?’ అని ప్రతి విద్యార్థి ప్రశ్నించుకోవాలని అన్నారు. దేశంలో గత కొన్నేళ్లుగా భారీ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని, అవి లేకపోతే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రాథమిక విద్య కూడా అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో భారీగా ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ అనేక విద్యాసంస్థల్లో సరైన ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు చెల్లిస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యకు తగినంతగా ఎందుకు వినియోగించడం లేదు? అని ప్రశ్నించారు. దేశంలో విద్యా వ్యవస్థ క్రమంగా కోచింగ్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల సమస్యలను ప్రశ్నిస్తున్న వారిపై బెదిరింపులు, వేధింపులు జరుగుతున్నాయన్నారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘స్కూల్‌ బచావో’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాడిన విద్యార్థి సంఘాల నాయకులను ఐషి ఘోష్ అభినందించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి.రామ్మోహన్ మాట్లాడుతూ బిజెపి 12 ఏళ్ల అధికారంలో దేశంలో నూతన సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందన్నారు. జెన్ జీలు మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధంగా కావాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప అన్న నినాద స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగత్ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అక్బర్, నాయకులు అశోక్, తేజ, రవీంద్ర, అనిత, మధు, భాస్కర్, వర్షిత, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్