తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా .... ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలతో పంచుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం మిడ్జిల్‌లో ‘రేవంత్ రెడ్డి’గా మొదలైన తన ప్రస్థానం.. నేడు ప్రజల ఆదరాభిమానాలతో ‘రేవంతన్న’గా వారి గుండెల్లో నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం తాను చేసిన ప్రతి పోరాటంలో అండగా నిలిచిన ఆత్మీయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ‘తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడి’గా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అన్నింటికీ మించి ‘రేవంతన్న’గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2006, జులై 4 న నాటి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రేవంత్ రెడ్డి సంచలన విజయం సాధించారు. ఆ చిన్న గ్రామీణ స్థాయి గెలుపే నేడు ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం వరకు నడిపించింది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, తన తొలి విజయ క్షేత్రాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి నేడు మిడ్జిల్‌లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తన రాజకీయ పురిటిగడ్డ అయిన మిడ్జిల్ పర్యటన సందర్భంగా ... సిఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ. 350 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండకు చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధ ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సిఎం రాక సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేశాయి.
'20 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానం` : సిఎం రేవంత్ రెడ్డి పోస్టు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 12:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)