- సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: తెలుగు నాటకరంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా నంది నాటకోత్సవాలను పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనవరిలో నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నంది నాటకోత్సవాల ఎంట్రీల కోసం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. అక్టోబర్‌లో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, డిసెంబర్‌లో ప్రాథమికంగా ఎంపికైన నాటకాల జాబితాను ప్రకటిస్తామన్నారు. జనవరి 10న కందుకూరి అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ప్రారంభమై, వారం రోజుల పాటు ఎంపికైన నాటకాల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. అనంతరం నంది నాటకోత్సవాల పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు నాటక సమాజాలకు కూడా ఈసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీడియోల ఆధారంగా నాటకాలను పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేస్తామని చెప్పారు. గతంలో మూడు ఉన్న కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలను ఐదుకు పెంచామని, ఒక్కో పురస్కారానికి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. స్థానం నరసింహారావు, ఆచార్య ఆత్రేయ, గరికపాటి రాజారావు, బండారు రామారావు తదితర రంగ ప్రముఖుల పేర్లతో ఈ పురస్కారాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.
28 జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ముగ్గురికి, ప్రత్యేక సేవలు అందించిన మరో 16 మందికి కలిపి మొత్తం 100 మంది కళాకారులు, సంస్థలకు కందుకూరి విశిష్ట పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పద్యనాటకం, సాంఘిక నాటకం, రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజాలు తదితర విభాగాల్లో ఈ పురస్కారాలు ఉంటాయని తెలిపారు. నాటక పరిషత్తులకు గతంలో ఒక్కో దానికి రూ.5 లక్షలు ఇచ్చే విధానానికి బదులుగా, ఎక్కువ మంది కళాకారులకు ప్రయోజనం కలిగేలా ఒక్కో పరిషత్‌కు రూ.లక్ష చొప్పున విస్తృతంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. చిత్ర పరిశ్రమ, నాటకరంగానికి అవసరమైన అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ద్వారా సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన నంది అవార్డుల ప్రకటనను ఈ వారంలో విడుదల చేసి, జనవరి నాటికి అవార్డుల ప్రదానోత్సవాలను పూర్తి చేస్తామని చెప్పారు. పద్యనాటకం, సాంఘిక నాటకం, నాటిక, బాలల నాటిక, కాలేజీ, యూనివర్సిటీ నాటిక, రంగస్థలంపై ఉత్తమ పుస్తకం తదితర విభాగాల్లో నంది అవార్డులు అందించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.








కామెంట్‌లు (0)