శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్వియులో ఘనంగా ప్రారంభమైన జాతీయ గిరిజన సాంస్కృతిక మహోత్సవాలు

15 గంటల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 06:57 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- గిరిజన కళా సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుందాం

: ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కిరికిరి మురళీమోహన్, ఎస్టీ కమిషన్ మెంబర్ వెంకటప్ప

ప్రజాశక్తి - ఎస్వియూ క్యాంపస్ : గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం. భూపతి నాయుడు పేర్కొన్నారు. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ గిరిజన సాంస్కృతిక మహోత్సవాలు శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాసా ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ గిరిజన సాంస్కృతిక కళాబృందాలు పాల్గొని సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వాయిద్య ప్రదర్శనలతో సందడి చేశాయి. గిరిజనుల సంప్రదాయ వేషధారణలు, కళారూపాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గిరిజన సంస్కృతి దేశ సంపద: ఆరణి శ్రీనివాసులు

తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల కళలు, సంస్కృతి భారతదేశానికి ఉన్న గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమన్నారు. తరతరాలుగా గిరిజన సమాజాలు కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాలు, కళారూపాలను సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

గిరిజన యువత విద్యతో పాటు తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. గిరిజన కళాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తూ వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్థాయిలో గిరిజన కళాబృందాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలు సాంస్కృతిక ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు.

గిరిజన కళలకు మరింత ప్రోత్సాహం: కలికిరి మురళీమోహన్

పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు వారి కళల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. ఆధునిక కాలంలో అనేక సంప్రదాయ కళారూపాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నందున వాటిని కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గిరిజన విద్యార్థులు విద్యా రంగంలో మరింతగా రాణించాలని, తమ సాంస్కృతిక మూలాలను కూడా కాపాడుకోవాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రాంతీయ కళలను ప్రదర్శించడం ద్వారా దేశంలోని గిరిజన సంస్కృతుల వైవిధ్యం ప్రజలకు పరిచయం అవుతుందని తెలిపారు.

గిరిజనుల హక్కులు, అభివృద్ధికి ప్రాధాన్యం: పి. వెంకటప్ప

రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి, విద్య, ఉపాధి, సామాజిక సాధికారతతో పాటు వారి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

గిరిజనుల ప్రత్యేక జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయ కళలు దేశ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకలన్నారు. గిరిజన యువత తమ హక్కులపై అవగాహన పెంపొందించుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. గిరిజన కళాకారులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించేలా మరిన్ని సాంస్కృతిక వేదికలు ఏర్పడాలని ఆకాంక్షించారు.

ఎస్వీయూ వేదికగా గిరిజన సంస్కృతికి ప్రాచుర్యం: రిజిస్ట్రార్ భూపతి నాయుడు

ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం. భూపతి నాయుడు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు కేవలం విద్య, పరిశోధనలకు మాత్రమే కాకుండా దేశంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు వేదికలుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించడం ద్వారా వివిధ ప్రాంతాల గిరిజన కళలు, సంప్రదాయాలను విద్యార్థులు, ప్రజలు తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు. గిరిజన సమాజాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి

మహోత్సవాల ప్రారంభానికి ముందు ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అతిథులు, టీఎస్ఎఫ్ నాయకులు, కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాసా ఆడిటోరియం వరకు గిరిజన కళాబృందాలతో భారీ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.

గిరిజన కళా ప్రదర్శనలతో సందడి

దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన కళాబృందాలు సంప్రదాయ వేషధారణలతో నృత్యాలు, జానపద గీతాలు, వాయిద్య ప్రదర్శనలు నిర్వహించాయి. సంప్రదాయ వాయిద్యాల నాదంతో పాటు కళాకారుల ఉత్సాహభరిత నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల గిరిజన సంస్కృతులు, సంప్రదాయాల వైవిధ్యం ఈ ప్రదర్శనల్లో ప్రతిబింబించింది.

గిరిజన విద్యార్థుల ఐక్యతకు వేదిక

టీఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కరంశి అక్కులప్ప నాయక్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు, కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ మహోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు టీఎస్ఎఫ్ కృషి చేస్తోందన్నారు. టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముడావత్ విష్ణు నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన టీఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, గిరిజన విద్యార్థులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే మహోత్సవాల్లో మరిన్ని గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్