జయప్రదం చేయాలి : ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26 నుంచి పది రోజుల పాటు దేశవ్యాప్తంగా వంద ప్రధాన కేంద్రాల్లో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్రెడ్డి కోరారు. బుధవారం నంద్యాలలోని టి నరసింహయ్య భవన్లో ఆందోళనల సన్నాహక సమావేశం ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరలు స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా నిర్ణయించి, పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలలో ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. రైతులకు, కార్మికులకు నష్టదాయకంగా, కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా విత్తన, విద్యుత్ చట్టం, ఉపాధి చట్టం మార్పులు, కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయ మార్కెట్ కమిటీల అప్పగింత తదితర అంశాలన్నింటినీ వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పదిరోజులపాటు నిరవధికంగా దేశవ్యాప్తంగా నిరవధిక ఆందోళనలకు పిలుపునిచ్చారని, జిల్లాలోని అన్ని పక్షాలు ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, వ్యవసాయ కార్మిక సంఘం(డికెఎంయు) జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రైతు సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి సోమన్న, ఎ రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)