బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీఐ చట్టం అమలులో నిర్లక్ష్యం సహించం

4 రోజుల క్రితం

rti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమాచార హక్కు చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4-1బి నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ రూరల్‌లోని గొల్లపూడిలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం, గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, బందరు రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయాలను సందర్శించి ఆర్టీఐ చట్టం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఆర్టీఐ రిజిస్టర్లు, రికార్డులు, పౌరులకు అందిస్తున్న సమాచార వ్యవస్థను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదంటూ కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, మొదటి అప్పీలేట్ అథారిటీల వివరాలతో నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, జాబ్ చార్టులు, సిటిజన్ చార్టర్లను ప్రదర్శించకపోవడం వంటి లోపాలు గుర్తించినట్లు చెప్పారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్ర సమాచార కమిషన్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా సమాచార కమిషనర్లకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీఐ చట్టంపై అవగాహన పెంచడంతో పాటు చట్టాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయించడమే ఈ తనిఖీల లక్ష్యమని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్