చేనేత, జౌళి శాఖమంత్రి సవిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు, హస్త కళాకారులు గౌరవప్రదమైన జీవనం సాగించే లక్ష్యంతో త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల ప్రగతిపై శనివారం సచివాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతిలోని శాఖమూరులో పది ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఏర్పాటుకు నిర్ణయించామని వెల్లడించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ నినాదంతో, చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించారని, ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సిఎం చంద్రబాబు నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. చేనేత రంగానికి పూర్వవైభం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టెక్స్ టైల్స్ అప్పారెల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29 తీసుకొచ్చామన్నారు. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో టెక్స్ టైల్స్ రంగంలో రూ.10 వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షణతో పాటు 2 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు.ఏప్రిల్ నుంచి 50,565 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. నేతన్నలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, అమరావతిలో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆప్కో బ్రాండ్ నిలిబెట్టేలా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే వస్త్రాలను విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లేపాక్షి షో రూమ్‌లను ఆధునీకరించడంతో పాటు, విదేశాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి సీఈవో సింహాచలం, కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)