ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనెలవారీ ఆర్థిక నివేదికతో సరికొత్త పరిపాలనకు శ్రీకారం : మంత్రి పార్థసారధి

14 జులై, 2026

kolusu parthasarathy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రతి నెలా ‘నెలవారీ ఆర్థిక నివేదిక’ రూపొందించే విధానాన్ని ప్రారంభించడంతో దేశంలోనే సరికొత్త పరిపాలనా సంస్కరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆర్థిక నివేదికలు వార్షిక ప్రాతిపదికన మాత్రమే రూపొందించేవారని, ఇకపై ప్రతి నెలా రాష్ట్రంలోని అన్ని శాఖల పనితీరు, ఆదాయ-వ్యయాలు, అభివృద్ధి సూచికలు, సంక్షేమ పథకాల అమలు, లక్ష్యాల పురోగతిని సమీక్షించే విధంగా నివేదిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఇది కేవలం నివేదిక మాత్రమే కాకుండా ప్రభుత్వ పరిపాలనకు దిశానిర్దేశం చేసే ప్రామాణిక పత్రంగా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన ఈ విధానం ద్వారా డేటా ఆధారిత సుపరిపాలనకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ‘జీరో పెండెన్సీ’ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న పాత చట్టాలు, కాలానుగుణంగా అవసరం లేని నిబంధనలను సమీక్షించి అవసరమైతే సవరణలు చేయడానికి, కొత్త చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వృద్ధి రేటు ప్రస్తుతం జాతీయ సగటును మించి నమోదవుతోందని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, సాంకేతికత వినియోగం, పారదర్శక వ్యవస్థలు, జీరో పెండెన్సీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉత్తమ పరిపాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్