మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపత్తి కొనుగోళ్లకు కొత్త మార్గదర్శకాలు

1 గంట క్రితం

patti.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిసిఐ ద్వారా కనీస మద్దతు ధర

  • కార్యాచరణను ప్రకటించిన ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రానున్న సీజన్లలో పత్తి కొనుగోళ్ల కోసం ప్రామాణిక మార్గదర్శకాలను (ఎస్‌ఒపి) ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సిసిఐ గుర్తించిన మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతాయని, జిల్లా సంయుక్త కలెక్టర్లు, సిసిఐ జనరల్‌ మేనేజర్‌ లేదా బ్రాంచ్‌ మేనేజర్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు సమన్వయంతో జిన్నింగ్‌ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించి నోటిఫై చేస్తారని తెలిపింది. పత్తి రైతుల గుర్తింపును వ్యవసాయ శాఖకు చెందిన ఆధార్‌ ఆధారిత ఇ-పంట నమోదు వివరాల ఆధారంగా చేపట్టనున్నారు. రైతులు ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ లేదా సిసిఐ పత్తి కొనుగోలు వ్యవస్థలో స్లాట్‌, సమయాన్ని ముందుగా బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మండలాల వారీ పత్తి దిగుబడి, ఏరుకునే కాలాలను చేయనున్నట్లు తెలిపారు. ఈ వివరాల ఆధారంగానే రైతు సాగు విస్తీర్ణం, ఎకరాకు దిగుబడి, ఏరుకునే దశల ప్రకారం కొనుగోలు చేయాల్సిన పత్తి పరిమాణాన్ని నిర్ణయిస్తారు. కొనుగోలు కేంద్రాలకు పత్తిని వదులుగా తీసుకురావాలని, స్లాట్‌ బుకింగ్‌, మార్కెట్‌ యార్డు లేదా జిన్నింగ్‌ మిల్లులో పత్తి విక్రయించే సమయంలో రైతులు ఆధార్‌ కార్డుతో పాటు పట్టాదారు పాస్‌బుక్‌ కలిగి ఉండాలని పేర్కొంది. పత్తి విక్రయానికి సంబంధించిన చెల్లింపులను సిసిఐ ఆధార్‌తో అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే ఆన్‌లైన్‌ ద్వారా జమ చేయనుంది. మార్కెట్‌ యార్డుల్లోని నిర్మాణాలు, పత్తి నిల్వలకు బీమా చేయాలని పేర్కొంది. కాగా పత్తి ఎంఎస్‌పి కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఛైర్మన్‌గా, జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్‌ అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు, అదనపు పోలీసు సూపరింటెండెంట్‌, జిల్లా అగ్నిమాపక అధికారి, సిసిఐ ప్రతినిధులు, రవాణాశాఖ ఉప కమిషనర్‌, పత్తి వ్యాపార ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్