- భూ రీ-సర్వే 2.0 ద్వారా పారదర్శకంగా భూ పరిపాలన
- వెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్న రిజిస్ట్రేషన్ సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని విభజించి తిరుచానూరులో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బుధవారం తిరుచానూరులో ఏర్పాటు చేసిన నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ కమిషనర్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దుగ్గుమల్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుచానూరు ప్రాంతంలో ఉన్న పాత సచివాలయ భవనాన్ని ఆధునీకరించి తాత్కాలికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా మార్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత భవనాన్ని నిర్మించి అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. భూముల రీ-సర్వే 2.0 కార్యక్రమంపై మంత్రి ప్రత్యేకంగా స్పందిస్తూ, గతంలో సర్వే ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ప్రస్తుతం ప్రతి పట్టాదారుకు పూర్తి సమాచారం అందిస్తూ అత్యంత పారదర్శకంగా రీ-సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. వాట్సాప్ గ్రూపులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ, ఈ-కేవైసీ ధృవీకరణ వంటి విధానాల ద్వారా భూ యజమానుల సమ్మతి, ధృవీకరణ అనంతరమే సర్వే పూర్తయినట్లు నిర్ధారిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సుమారు 7.5 లక్షల ఫిర్యాదులు, దరఖాస్తులను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భూమి వివాదాలు, 22-ఏ భూములకు సంబంధించిన అంశాలు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంలో చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తాజ్ సర్కిల్ నుండి శ్రీనివాసపురం వాటర్ ట్యాంక్ వరకు ఏర్పాటు చేయనున్న శాశ్వత పైప్‌లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ పైప్‌లైన్ పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి పంపిణీ వ్యవస్థ బలోపేతం కానుందని తెలిపారు. అనంతరం శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ పరిధిలో మార్కెట్ యార్డ్ నుండి తాజ్ సర్కిల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు మరియు మురుగు కాలువలను మంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ పనులు ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడటంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా, పారిశుధ్య సౌకర్యాలను అందించనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా రిజిస్ట్రార్ శ్రీ రామ్‌కుమార్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ప్రజాప్రతినిధులు, అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)