- ముగ్గురు నిందితులు అరెస్టు
ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడలో నవజాత శిశువును అక్రమంగా కొనుగోలు చేసిన కేసును కృష్ణలంక పోలీసులు ఛేదించారు. మూడు రోజుల వయసుగల ఆడ శిశువును రూ.6.59 లక్షలకు కొనుగోలు చేసినట్లు గుర్తించి పోలవరం గ్రామానికి చెందిన కొనతం వెంకట కృష్ణారెడ్డి, భార్య శివపార్వతి, బీహార్ రాష్ట్రానికి చెందిన సయ్యద్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నవజాత శిశువుతో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... వెంకట కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఐవిఎఫ్, సరోగసీ ద్వారా సంతానం కోసం ప్రయత్నించారు. ఢిల్లీలోని ఓ ఐవిఎఫ్ కేంద్రంలో చికిత్స పొందగా వారికి సంతానం కలిగే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. డబ్బులకు నవజాత శిశువును విక్రయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆ మహిళ సూచనల మేరకు విడతల వారీగా మొత్తం రూ.6.59 లక్షలు చెల్లించిన అనంతరం శిశువును తీసుకెళ్లాలని చెప్పడంతో దంపతులు మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. శిశువును తీసుకుని ప్రకాశం జిల్లాకు బయలుదేరారు. ఈ క్రమంలో విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం రాజీవ్ గాంధీ పార్కు సమీపాన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో శిశువుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని ప్రశ్నించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శిశువును అక్రమంగా కొనుగోలు చేసిన విషయం వెలుగులోకి రావడంతో వారిని అరెస్ట్ చేశారు. అడ్మిన్ డిసిపి కె.జి.వి.సరిత పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి కె.లతాకుమారి, సౌత్ ఎసిపి మానస ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వాసవి, సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల దర్యాప్తులో సయ్యద్ ఆలం భార్య అమ్రిన్ ఢిల్లీలోని ఓ ఐవిఎఫ్ కేంద్రంలో పనిచేస్తున్నట్లు, ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని శిశువులను విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)