హైకోర్టుకు సిట్ నివేదిక
ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం తుది విచారణ ప్రారంభించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాదులు సివి మోహన్‌రెడ్డి, సురేంద్రరావు వాదిస్తూ.. జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలను నిర్ధారించేందుకు కోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. సిట్ నివేదిక ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అనుకూలంగా ఉందన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని మాత్రమే సిట్ చెప్పిందని, అక్రమాలు జరిగినట్లు ఎక్కడా నిర్ధారించలేదని పేర్కొన్నారు. ఎపిపిఎస్‌సి చర్యలతో ఎంపికైన అభ్యర్థులు లబ్ధి పొందినట్లు, అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ పేర్కొనలేదన్నారు. హాయ్‌ల్యాండ్‌లో జరిగిన మూల్యాంకనంలో నిబంధనలు పాటించనందునే విజయవాడలో మూల్యాంకనం చేయాలని ఎపిపిఎస్‌సి నిర్ణయించిందని న్యాయవాదులు తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో అప్పీళ్లపై విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ డి రమేష్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. గ్రూప్-1 జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని సింగిల్ జడ్జి 2024 మార్చి 13న తీర్పు ఇచ్చారు. దీనిపై ఎపిపిఎస్‌సి, ఎంపికైన అభ్యర్థులు, ఎంపిక కాని అభ్యర్థులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వాస్తవాలు తేల్చేందుకు సిఐడి డిజి నేతృత్వంలో హైకోర్టు సిట్ ఏర్పాటు చేయగా, అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక దాఖలు చేసింది.








కామెంట్‌లు (0)