సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదల ఆహార భద్రతపై రాజీ పడితే సహించేది లేదు

5 గంటల క్రితం

pratap.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి

ప్రజాశక్తి – గిద్దలూరు (ప్రకాశం) : రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆహార భద్రత విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా, మెనూలో మార్పులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గిద్దలూరులోని పలు సంక్షేమ వసతిగృహాలు, గిరిజన గురుకుల పాఠశాలలు, రేషన్ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి ఆరు సార్లు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, కొన్ని చోట్ల మూడు నుంచి నాలుగు సార్లే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలిందని ఛైర్మన్ తెలిపారు. ధరల పెరుగుదలను సాకుగా చూపి ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం, కోడిగుడ్ల సంఖ్యలో కోత విధించడం వంటి మెనూ డీవియేషన్లను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

పీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు (ఐసీడీఎస్), పీఎం పోషణ్ యోజన వంటి సంక్షేమ పథకాల అమలును ఫుడ్ కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ ప్రయోజనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని చెప్పారు. అవకతవకలు గుర్తిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు సస్పెన్షన్‌కు సిఫారసు చేయడం, సుమోటోగా కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అందించే ఆహారంలోనూ అక్రమంగా డబ్బు సంపాదించాలని చూస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రేషన్ షాపుల్లో తూనికల్లో మోసాలు, తక్కువ సరుకులు ఇవ్వడం లేదా సంక్షేమ పథకాల మెనూలో తేడాలు కనిపిస్తే ప్రజలు వెంటనే వీడియో తీసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490551117కు పంపాలని ఆయన కోరారు. వీడియో ఆధారంగా ఫిర్యాదులు అందితే తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్