శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసాహిత్యోద్యమ చైతన్యానికి నిలయం ఉత్తరాంధ్ర

6 గంటల క్రితం

సాహిత్యోద్యమ చైతన్యానికి నిలయం ఉత్తరాంధ్ర
 - సామాజిక సవాళ్లపై కార్యాచరణ అవసరం 
- ఓటుకు చేటు తెచ్చేలా పాలకుల చర్యలు
- సాహితీ స్రవంతి రాష్ర్ట గౌరవాధ్యక్షులు, కవి, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి 
- విశాఖలో ఘనంగా సాహిత్య సమ్మేళనం ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 09:47 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సామాజిక సవాళ్లపై కార్యాచరణ అవసరం

  • ఓటుకు చేటు తెచ్చేలా పాలకుల చర్యలు

  • సాహితీ స్రవంతి రాష్ర్ట గౌరవాధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి

  • విశాఖలో ఘనంగా సాహిత్య సమ్మేళనం ప్రారంభం

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో :‘దేశంలో నేడు హక్కుల కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం అనేక సామాజిక ఉద్యమాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో విశాఖలో కవులు కలాలు కదిలించేందుకు రెండు రోజుల ‘సాహిత్య సమ్మేళనం’ చేపడుతున్నారు. ప్రజల తరఫున తెలుగు భాష పోరాట వారసత్వాన్ని నిలబెట్టుకోడానికి వారంతా కృషి చేస్తున్నారు. సాహిత్యోద్యమ చైతన్యానికి నిలయం ఉత్తరాంధ్ర’ అని సాహితీ ప్రస్థానం సంపాదకులు, సాహితీ స్రవంతి రాష్ర్ట గౌరవాధ్యక్షులు, కవి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం నుంచి రెండు రోజులపాటు జరుగనున్న సాహిత్య సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. సాహితీ స్రవంతి రాష్ర్ట కార్యదర్శి చీకటి దివాకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో కవులు, రచయితలు దర్భశయనం శ్రీనివాసాచార్య, ప్రొఫెసర్‌ ‌కెఎస్‌‌.చలం, డాక్టర్‌ ‌డివిజి.శంకరరావు, అట్టాడ అప్పలనాయుడు, నల్లి ధర్మారావు, ఎంవిఎస్‌.శర్మ, అరసవిల్లి కృష్ణ, జెపి.శర్మ, కత్తి పద్మ, వంగపండు దుశ్యంత్‌ తదితరులు హాజరయ్యారు. ప్రారంభ సభలో తెలకపల్లి రవి మాట్లాడారు. మన్యం విప్లవ సూరీడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంలో సాహితీ స్రవంతి, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇతర సాహిత్య సంస్థల సమన్వయంతో సమ్మేళనం జరగడం అభినందనీయమన్నారు. మహాకవి గురజాడ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సవాళ్లకు ధీటుగా, పెరుగుతున్న అసమానతలను నిలదీసేందుకు విశాఖ ఉక్కు దగ్గర నుంచి పర్యావరణ రక్షణ వరకూ ఉత్తరాంధ్ర కవులు అనేక ఉద్యమాలకు బాసటగా వారి కలాలను సంధిస్తున్నారని వివరించారు. కాలం ముందుకు కదులుతుందని చెబుతూ శ్రీశ్రీ రచనలు, పాటలను రవి ఉటంకించారు. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర, ఉద్యమాంధ్ర, ఉజ్వలాంధ్ర అని పేర్కొంటూ కొత్త తరాలకు, కొత్త స్వరాలకు ఈ ప్రాంతం ఆహ్వానం పలుకుతూనే ఉందన్నారు. మహాకవి గురజాడ అన్నట్లు ‘ఒట్టిమాటలు కట్టిపెట్టి.. గట్టి కవితలు రాయవోయ్‌’ అంటూ రవి వ్యాఖ్యానించడంతో సభికులంతా చప్పట్లు మోగించారు. ‘సమాజానికి, సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం ఉండేలా దేశం మొత్తానికి వర్తించే పాట ఏది అంటే వందేమాతరం అంటాం, శ్రీకాకుళం ఉద్యమం గురించి చెప్పాలంటే ఉత్తరాంధ్రలో ఏం పిల్లడో ఎల్దమొస్తవా... తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పాలంటే బండెనక బండి కట్టి అనే చెబుతాం. ఈ రచనలు ఆ నాటి పరిస్థితులను పట్టిచూపుతాయి’ అని పేర్కొన్నారు. ‘ఆకలి మంటలు మలమలలాడే అనాథులందరు లేవండోయ్‌’ అనే పాటలోని సందేశం దేశానికి నేడు చాలా అవసరమన్నారు. ‘ఉక్కు కర్మాగారాన్ని అడ్డంగా అమ్మే కుట్రలు ఆపడానికి, కొండలు, గుట్టలు మింగే బాబుల కోటి కుట్రలను కూల్చడానికి ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అని రవి సభలో పాడగానే చప్పట్ల వర్షం కురిసింది. తెలుగు నేల, సంస్కృతిని కాపాడుకోవడానికి సాహిత్య సభలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. నేడు దేశంలో ఓటుకు సైతం చేటు తెచ్చేలా పాలకుల చర్యలున్నాయని తెలిపారు. అక్షరానికి గొప్ప శక్తి ఉందని, సామాజిక సవాళ్లపై కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రొఫెసర్‌ ‌కెఎస్‌.చలం మాట్లాడుతూ ‘ పదండి ముందుకు పదండి’ అని శ్రీశ్రీ అన్నారని.. అప్పట్లో ఎర్రజెండా నిగనిగలాడిందని అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థపై కవులు, సాహితీకారులు కళాలను సంధించి ప్రశ్నించాలన్నారు. డివిజి.శంకరరావు మాట్లాడుతూ సమాజానికి ఇంధనం వంటిది సాహిత్యమని, ఆ ఇంధనం కల్తీ కాకుండా చూడాల్సిన బాధ్యత నేటి కవులు, రచయితలపై ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కవులు, రచయితలు, సాహితీవేత్తల వివరాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకట్టుకుంది. డప్పు శ్రీను, సుభద్ర, చీకటి చంద్రికారాణి ఆలపించిన చైతన్య, దేశభక్తి గీతాలు అలరించాయి. ప్రారంభ సభ అనంతరం ‘వర్తమాన కవిత్వం-తీరు తెన్నులు’ అనే అంశంపై ప్రముఖ సాహితీ వేత్త, కవి దర్భశయనం శ్రీనివాసాచార్య మాట్లాడారు.‘బహుళత్వమే ఇప్పుడు కవిత్వ లక్షణం’ అని అన్నారు. సృజనకారుల స్వరాలు చైతన్యం రేకెత్తించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్