1500 ఉద్యోగాల కోసం 28 లక్షల మంది ప్రజలు బలికావాలా?
బహిరంగ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో :లక్షల మంది ప్రజల ఆరోగ్యాలను హరించే డేటా సెంటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిలోవ ముడవసర్లోవ ప్రాంతంలో ఏర్పాటు చేయనివ్వబోమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం అన్నారు. 1500 మంది ఉపాధి కోసం లక్షలాది ప్రజల జీవితాలను, ఆరోగ్యాలను ఫణంగా పెట్టాలా? అని ప్రశ్నించారు. ఈ డేటా సెంటర్లను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ‘గూగుల్ అదాని డేటా సెంటర్ నుంచి అడవివరం, కంబాలకొండ, ముడసర్లోవ, అడవులు, పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ నాలుగురోజుల పాటు చేపట్టిన పాదయాత్ర అనంతరం గురువారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సభలో లోకనాథం మాట్లాడుతూ... విశాఖ జిల్లా తర్లువాడ, అడవివరం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వంటి ప్రాంతాల్లోని సుమారు 610 ఎకరాల పచ్చని పర్యావరణ ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటు పేరిట... ఇక్కడి రిజర్వాయర్లు, కొండలను ధ్వంసం చేసి, పర్యావరణాన్ని ఎడారిగా మార్చేసే అజెండాతోనే టిడిపి కూటమి పాలకులు ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. కనీసం ఇంతవరకూ ఒక్క సభ అయిన పెట్టి ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారా? అని ప్రశ్నించారు. గూగుల్‌ను ముందుపెట్టి అదాని కోసం భూముల వేటను చంద్రబాబు సర్కారు ప్రారంభించిందని విమర్శించారు. గత వైసిపి హయాంలో కాపులుప్పాడలో 400 ఎకరాలను అదానికి ఇచ్చారని, ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అభివృద్ధికి సిపిఎం వ్యతిరేకం కాదని, ఇక్కడ కార్పొరేట్ల అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి ఏమీ లేదన్నారు. డేటా సెంటర్ల ద్వారా వచ్చే వేడితో ప్రజలు జీవించలేరని, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ డేటా సెంటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని కోరారు. విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ... ప్రజానీకం తలచుకుంటే ఎలాంటి ప్రభుత్వ విధానాన్నయినా వెనక్కి కొట్టగలరని, అదాని సిమెంట్ ఫ్యాక్టరీతో పర్యావరణానికి కలగబోయే ముప్పుపై నగర ప్రజానీకం చేసిన పోరాటమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఈ డేటా సెంటర్లతో కార్పొరేట్లు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారే తప్ప ప్రజల అభివృద్ధికి తోడ్పడరని విమర్శించారు. సిపిఎం నాయకులు ఆర్‌కెఎస్‌వికుమార్, పి.మణి, అప్పలరాజు, నరేంద్ర కుమార్, పి.శంకరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఎంవి ప్రసాద్, ఐద్వా రాష్ర్ట నాయకులు కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)