శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒక తొమ్మిది ప్లానింగు జోన్లు

1 గంట క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్ బిజినెస్‌‌లో భాగంగా సులభతర ప్లానింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఉన్న జోనింగ్ నిబంధనల స్థానంలో తొమ్మిది జోన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. రెండవ దశ సంస్కరణలలో భాగంగా భూ వినియోగానికి సంబంధించి అతి తక్కువ జోన్‌లను కలిగి ఉండి, "నిషేధిత జాబితా" కు లోబడి అన్ని జోన్లలో కార్యకలాపాలకు ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం, 1920 లోని సెక్షన్ 44-ఏ నిబంధనల ప్రకారం ముసాయిదా ఉమ్మడి జోనింగ్ నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో నివాస, వాణిజ్య, పారిశ్రామిక, బహిరంగ ప్రదేశాలు ప్రజా సౌకర్యాల జోన్‌లు స్పష్టంగా ప్రస్తావించారు. జోనింగ్ నిబంధనలు అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడే చట్టపరమైన సాధనంగా ప్రస్తావించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వివిధ నగరాలకు వేర్వేరు సమయాల్లో మాస్టర్ ప్లాన్‌లు తయారయ్యాయని, వాటిలో ఏకరూపత లేకపోవడం వల్ల ప్రజలకు, సాంకేతిక నిపుణులకు మరియు ప్రభుత్వ సంస్థలకు తీవ్ర గందరగోళం ఏర్పడుతోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా 'ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్' ద్వారా ఒకే వేదికపై అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు వర్తించేలా ఒకే ఉమ్మడి జోనింగ్ నిబంధనలను తీసుకురావడం తక్షణ అవసరంగా మారిందని తెలిపారు. ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నిబంధనలను కూడా పరిశీలించి ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. దీనికోసం మొత్తం తొమ్మిది జోన్లు ఏర్పాటు చేశారు. నివాసం, వాణిజ్యం,ప్రభుత్వరంగం, వినోద విహార, పారిశ్రామిక, వర్కు సెంటర్ , రెడ్‌, ఆరంజ్‌‌, రవాణా, మిక్స్‌‌డ్‌, వ్యవసాయ, అభివృద్ధి పరిమితులున్నజోన్‌, రక్షిత జోన్‌‌గా మొత్తం ప్రాంతాన్ని విభజించారు. అలాగే ప్రత్యేక నిర్మాణాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పొందుపరిచారు.

ఫామ్‌హౌస్‌లు : కనీసం అర ఎకరం (0.50 Acre) వ్యవసాయ భూమి ఉండి, కేవలం 10 శాతం విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణం చేపడుతూ, గరిష్టంగా జీ+1 అంతస్తులు (11 మీటర్ల ఎత్తు వరకు) నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు.

రహదారి వెడల్పు నిబంధనలు: పారిశ్రామిక మరియు నివాస భవనాలు కాకుండా ఇతర నాన్-రెసిడెన్షియల్ భవనాలకు కనీసం 300 చదరపు మీటర్ల స్థలం 60 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్డు కలిగి ఉండాలని తెలిపారు.

ప్రభుత్వ ప్రాజెక్టులు : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి జోనింగ్ మార్పులనైనా అనుమతించే అధికారం సంబంధిత ప్రాధికార సంస్థకు ఉంటుంది.

రహదారి మరియు బఫర్ దూరాలు : జలాశయాలు (నదులు, కాల్వలు, చెరువులు), జాతీయ రహదారులు పారిశ్రామిక బఫర్ జోన్లకు సంబంధించిన దూర పరిమితులు ఏపీ భవన నిర్మాణ నిబంధనలు - 2017 ప్రకారం పాటించాల్సి ఉంటుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్