మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనసాగుతున్న గాలింపు

1 గంట క్రితం

missing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 12:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నాలుగు రోజులైనా చిక్కని మత్స్యకారుల ఆచూకీ

ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : సముద్రంలో బోటు మునిగి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ నాలుగు రోజులైనా లభించలేదు. హెలికాప్టర్లు, నౌకలతో గాలిస్తున్నా మంగళవారం రాత్రి నాటికీ ఫలితం కనిపించలేదు. భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సమన్వయంతో సముద్రంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐసిజిఎస్ కనక్ లతా బరువా, ఐసిజిఎస్ వీర నౌకలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. తీర రక్షక దళానికి చెందిన మూడు హెలికాప్టర్లు సముద్రంలో విస్తృతంగా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. గాలింపు చర్యలను విశాఖపట్నంలోని రీజినల్ ఆపరేషన్స్ సెంటర్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మరోవైపు భారత నౌకాదళం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యమై రెండు యుద్ధ నౌకలు, ఒక సీకింగ్ హెలికాప్టర్, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్‌‌ను మోహరించింది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు నౌకలు, హెలికాప్టర్లు, ఇతర వనరులతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిరంతరాయంగా కొనసాగించాలని విశాఖ కలెక్టర్‌ అభిషిక్త్‌ ‌కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ తమవారి జాడ చిక్కకపోవడంతో బాధిత మత్స్యకార కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతైనట్లు జబ్బర్ తోటకు చెందిన రాగుతు లక్ష్మి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ సిఐ పి.వరప్రసాద్ మీడియాకు తెలిపారు.

​బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : మత్స్యశాఖ క‌మిష‌న‌ర్ రామ శంక‌ర్ నాయ‌క్

బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన చిన్నాను మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ మంగళవారం విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నాతో మాట్లాడి ప్రమాద వివరాలు సేకరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం ఫిషింగ్ హార్బర్‌లోని మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలిశారు. వారిని పరామర్శించి ఓదార్చారు. 72 గంట‌ల గాలింపు చర్యలు పూర్తవ్వ‌గానే నిబంధనల ప్రకారం తక్షణ సహాయం, పునరావాస చర్యలుంటాయ‌ని వెల్ల‌డించారు. ఆయన వెంట మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్‌‌బిఎస్.వర్థన్‌, ఎడి, ఎఫ్‌‌డిఒ ముర‌ళి పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు నష్టపరిహారం : సిపిఎం డిమాండ్‌

బాధిత మత్స్యకార కుటుంబాలను సిపిఎం బృందం ఫిషింగ్ హార్బర్ వద్ద పరామర్శించింది. సముద్రవేటకు వెళ్లి పడవ ప్రమాదానికి గురై నాలుగు రోజులు గడుస్తున్నా ఇంతవరకూ ఆరుగురు మత్య్సకారుల ఆచూకీ లభించకపోవడంతో ఆ పేద మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెస్క్యూ ఆపరేషన్‌‌ను మరింత వేగవంతం చేయాలన్నారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్