మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబెర్లిన్‌లో వామపక్షం ఘన విజయం

44 నిమిషాల క్రితం

berlin.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తొలిసారిగా మేయర్‌‌ పీఠంపై కమ్యూనిస్టు

  • ఎలిఫ్ ఎరాల్స్‌‌కు పట్టం కట్టిన జర్మన్లు

బెర్లిన్: జర్మనీలోని బెర్లిన్ రాష్ట్ర ఎన్నికల్లో వామపక్ష పార్టీ డై లింకె (ది లెఫ్ట్) అతిపెద్ద పార్టీగా అవతరించింది. టర్కీ వలసదారుల కుమార్తెన ఎలిఫ్ ఎరాల్ప్ (45), జర్మనీ రాజధాని నగరానికి తదుపరి మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. పేదరికం, అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా ప్రచారం చేసిన ఆమె పార్టీ, నగరంలోని గృహ సమస్యలు, అద్దెల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. పెద్ద కార్పొరేట్ ఇళ్ల యజమానుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఇందులో భాగంకావడం గమనార్హం. సామాజిక అసమానతలను, పెద్ద వ్యాపార సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించాలని కోరుకునే ఎరాల్ప్‌ను, న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన డెమోక్రటిక్ సోషలిస్ట్ నేత జొహ్రాన్ మామ్దానీతో పోలుస్తున్నారు. 1990 జర్మనీ పునరేకీకరణ తర్వాత మొదటిసారిగా బెర్లిన్ మేయర్ కార్యాలయాన్ని చేజిక్కించుకోవాలంటే ఆమెకు మిత్రపక్షాల మద్దతు అవసరం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌‌పిడి), గ్రీన్స్‌తో కలిసి ‘‘రెడ్-రెడ్-గ్రీన్’’ కూటమి ఏర్పాటు చేయాలని ఆమె భావిస్తున్నారు. కానీ ఇది సవాలుతో కూడుకున్న పని. ఆస్తుల స్వాధీన ప్రతిపాదనను ఎస్‌‌పిడి వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్‌కు సైనిక సాయం, నాటోపై డై లింకె వైఖరిని కూడా వారు అంగీకరించడం లేదు.

​ద్వేషంపై ప్రేమ విజయం సాధించింది...

మితవాద, వలస వ్యతిరేక ఎఎఫ్‌‌డిపై తమ పార్టీ సాధించిన విజయంపై ఎరాల్ప్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘మా నగరంలో ద్వేషంపై ప్రేమ, న్యాయం విజయం సాధించాయి’’ అని ఆమె పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం అంతర్గత విభేదాలతో సతమతమైన డై లింకె, ఇప్పుడు జర్మనీ రాజకీయాల్లో అత్యంత చైతన్యవంతమైనశక్తులలో ఒకటిగా మారిందని ఫ్రెంచ్ పత్రిక లె మోండ్ వ్యాఖ్యా నించింది. ఓట్ల వివరాలకు సంబంధించి.. బెర్లిన్‌లో డై లింకె పార్టీకి 25.7 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 12 పాయింట్లు పెరిగాయి. ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్ట్స్‌కు చెందిన సంప్రదాయవాద క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సిడియు) 18.8శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మితవాద పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ ( ఎఎఫ్‌‌డి) 16.3శాతం ఓట్లతో మూడో స్థానంలో, గ్రీన్స్ 14.3శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. సెంటర్-లెఫ్ట్ ఎస్‌‌పిడి కేవలం 12.1శాతం ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. బెర్లిన్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఆ పార్టీకి ఇదే అత్యంత దారుణమైన ఫలితం. అలాగే, ఈశాన్య రాష్ట్రం మెక్లెన్‌బర్గ్-వెస్టర్న్ పోమెరేనియాలో ఎఎఫ్‌‌డి 38.2శాతం ఓట్లతో స్పష్టమైన విజయం సాధించింది. ఎస్‌‌పిడి 35.5శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మెర్ట్స్ పార్టీ సిడియు కేవలం 4.9శాతం ఓట్లు మాత్రమే సాధించి, తన ఎనిమిది దశాబ్దాల చరిత్రలో అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. సీట్లు గెలవడానికి అవసరమైన 5శాతం కనీస ఓట్ల పరిమితిని కూడా అందుకోలేకపోయింది.

​ఎవరు ఈ ఎరాల్ప్..

టర్కీలో వామపక్ష రాజకీయాలు, కార్మిక సంఘాల్లో చురుగ్గా పనిచేసిన ఎరాల్ప్ తల్లిదండ్రులు, 1980 సైనిక తిరుగుబాటు తర్వాత జర్మనీకి వలస వచ్చారు. ఆ సమయంలో ఆమె తల్లి ఎనిమిది నెలల గర్భవతి. మ్యూనిచ్‌లో జన్మించిన ఎరాల్ప్, హాంబర్గ్‌లో న్యాయ శాస్త్రం చదివి, తర్వాత వలసదారుల హక్కుల కోసం పనిచేశారు. 2010లో జర్మన్ పార్లమెంట్‌లో డై లింకె బృందానికి సిబ్బందిగా చేరిన ఆమె, ఆ తర్వాత శాశ్వతంగా బెర్లిన్‌కు మారారు. ప్రస్తుతం ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రముఖ క్రాయిట్జ్‌బర్గ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ఫలితాల అనంతరం, ఎఎఫ్‌‌డి జాతీయ సహ-నేత టీనో క్రుపల్లా, ఛాన్సలర్ మెర్ట్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాలు ‘‘విపత్తు’’గా మెర్ట్స్ అభివర్ణించినప్పటికీ, తన పదవిలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్