శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పూర్ణపాడు- లాబేసు వంతెన సాధనకు పాదయాత్ర

2 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 11:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సర్కారుకు నిర్లక్ష్యం తగదు

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ

ప్రజాశక్తి - కొమరాడ (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో రెండు దశాబ్దాలుగా దీర్ఘకాల సమస్యగా 60 గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో సాధన కమిటీ చేపట్టిన పాదయాత్ర రెండోరోజు శుక్రవారం కొమరాడ మండలంలోని బిన్నిడి నుంచి కెమిశీల, బందవలస, తాడంగి వలస, పూజారి గుడా, మర్రిగూడ, కుంబికోట మీదుగా సాగింది. పాదయాత్రగా వస్తున్న నాయకులకు ప్రతి గ్రామంలోనూ గిరిజనులు పూల దండలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. వారూ పాదయాత్రలో పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి నాగావళి నదిపై మధ్యలో నిలిచిపోయిన పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేసి గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి 20 ఏళ్లు అవుతున్నా సక్రమంగా నిధులు కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. అనేక గ్రామాలకు కనీసం రహదారి సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజు మన్యంలో డోలీ మోతలు జరుగుతూనే ఉన్నాయన్నారు. చివరికి వైద్యం సక్రమంగా అందకపోవడంతో మరణించిన మృతదేహాలను కూడా డోలీపైనే గ్రామాలకు తీసుకువెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 70 శాతం పనులు పూర్తయి కేవలం ఇంకా మూడు ఫిల్లర్లు పనులు చేస్తే రాకపోకలకు ఇబ్బందులు ఉండవని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆర్భాటంగా సిసి రోడ్లు డ్రయినేజీలు నిర్మిస్తున్నారని, వాటిపై ఉన్న శ్రద్ధ ఈ వంతెన నిర్మాణంపై పాలకులకు లేకపోవడం దారుణం అన్నారు. పాదయాత్రకు సిపిఐ జిల్లా కార్యదర్శి కె మన్మధరావు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గిరిజనులు అటవీ ప్రాంతంలో లభించే అటవీ ఉత్పత్తులను పార్వతీపురం, ఒడిశా ప్రాంతానికి తీసుకువెళ్లి అమ్ముకునేందుకు ఎంతో అవకాశం ఉంటుందని అన్నారు. నిర్మాణం పూర్తవ్వకపోతే ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యాన ఆందోళనలు, పోరాటాలు మరింత ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో వంతెన సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, వి ఇందిర, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె లింగరాజు, పువ్వుల ప్రసాద్, జెఎసి నాయకులు మల్లయ్య, గంగాధర్, బాధిత గ్రామాల గిరిజన ప్రజలు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్