ప్రజాశక్తి - తిరుపతి సిటీ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతిలోని రుయా హాస్పిటల్ నుంచి ఎన్‌టిఆర్ సర్కిల్ వరకు పారామెడికల్ విద్యార్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పి.పవిత్ర మాట్లాడుతూ నాలుగేళ్లలో పూర్తికావాల్సిన పారామెడికల్ కోర్సు అకడమిక్ ఇయర్ ఆలస్యం కారణంగా, 2021లో చేరిన విద్యార్థులకు 2026 వచ్చినా ఇంకా పూర్తికాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే విద్యార్థులు విలువైన సంవత్సరాలను కోల్పోయారని, ఇప్పుడు మరో సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేయాలని చెప్పడం వారిపై అదనపు భారాన్ని మోపడమేనని తెలిపారు. పారామెడికల్ విద్యార్థుల పోరాటం ఐదో రోజుకు చేరినా విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రోజుకు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దాదాపు 12 గంటలు ల్యాబ్స్, ఎమర్జెన్సీ వార్డులు, ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రి సేవల్లో కీలకంగా పనిచేస్తున్న విద్యార్థులకు ఎలాంటి స్టైఫండ్ లేకపోవడం అన్యాయమన్నారు. ‘విద్యార్థులు అందిస్తున్న సేవలకు గౌరవంగా కనీసం నెలకు రూ.15 వేలు స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం కల్పించాలని’ కోరారు. డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేసి, పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు సునీత, నగర కమిటీ సభ్యులు భాస్కర్, భారీ సంఖ్యలో పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.
పారా మెడికల్ విద్యార్థుల ధర్నా
54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)