మల్కాపురం సెంటర్ వద్ద హౌస్ కీపింగ్ కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ హౌస్ కీపింగ్ కార్మికుల వేతనాలను పెంచకుంటే సమ్మె అనివార్యమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హౌస్ కీపింగ్ కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మల్కాపురం సెంటర్‌లో రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, లక్ష్మణరావు మాట్లాడుతూ ఎనిమిదేళ్ల రెండు నెలలుగా వేతనాల పెంపు లేకపోవడం ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. నింగినంటిన నిత్యావసరాల ధరలతో, ఇఎంఐల భారంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ధరలు పెరిగినా కార్మికుల వేతనాలు మాత్రం పెరగకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు న్యాయమైన వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. గత ఐదు నెలలుగా వేతనాల పెంపు కోసం సంబంధిత అధికారులు, మంత్రులను కలిసి పలుమార్లు విజ్ఞప్తులు చేశామని నాయకులు తెలిపారు. ప్రతి సందర్భంలోనూ సానుకూలంగా స్పందిస్తూ ఆచరణలో మాత్రం వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం కార్మికులను నిరాశకు గురిచేస్తోందన్నారు.






కామెంట్‌లు (0)