- సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్‌ను ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన వెంట మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, ఎంపి లింగమనేని రమేష్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన అనంతరం సిఎం మీడియాతో మాట్లాడుతూ.. మూడున్నర గంటలపాటు అత్యున్నత వైద్యుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మూడు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ కొనసాగుతుందని చెప్పారు. ఎడమ భుజానికీ సమస్య ఉందని వైద్యులు గుర్తించారని, అయితే కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత సుమారు ఆరు నెలలకు మళ్లీ పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమా లేక ఫిజియోథెరపీతోనే పరిష్కారం సాధ్యమా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన సౌకర్యంగా ఉండి కోలుకుంటున్నారని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. రాబోయే నాలుగు నెలల్లో ఆయన పూర్తిస్థాయి కోలుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)