శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా ఉద్యమాల బలోపేతానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలి

1 గంట క్రితం

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 09:11 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మారావు

ప్రజాశక్తి - బాపట్ల : ప్రజా ఉద్యమాల బలోపేతానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. కృష్ణ ,గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థిగా ఎం హనుమంతరావు పరిచయ సభ శుక్రవారం పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జడ వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు హయాంలో రాజకీయ కారణాలతో మండలిని రద్దు చేశారని, మరలా 2007లో శాసన మండలి పునరుద్ధరణ జరిగిందన్నారు. మొదటగా ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల స్థానాలకు కలిపి 8 స్థానాలకు యు టి ఎఫ్ బలపరుస్తూ అభ్యర్థులను పోటీ చేయించడం జరిగిందని 7 స్థానాలలో గెలిచి చుక్కారామయ్య, డి.రామిరెడ్డిల సూచనలతో పిడిఎఫ్ ఏర్పడడం జరిగిందని చెప్పారు. అప్పటి నుంచి ఏపార్టీకీ అనుకూలంగా కాక స్వతంత్రంగా ప్రజల పక్షాన వివిధ రంగాల సమస్యల పరిష్కారానికి పనిచేయాలని నిర్ణయించామన్నారు. అప్పటినుండి పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రజా క్షేత్రంలోనూ, మండలిలో ప్రజా సమస్యల పరిష్కారానికి బాగా పనిచేశామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు లోబడకుండా పనిచేసామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీ లకు కేటాయించిన లక్షల రూపాయల విలువ ఉన్న స్థలాలను పేదలకు ఇవ్వాలని కోరుతూ తాము తిరస్కరించామని అన్నారు. అలాగే ప్రస్తుత పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి కూడా పిడిఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ స్థానాలలో కూడా రాజకీయం ప్రవేశించడంతో మేధావుల సభకు జరిగే ఎన్నికలలో కూడా గెలుపు కోసం అధికార పార్టీల విధానాల వలన మేధావుల సభకు పార్టీలకు అనుకూలంగా ఉండే వారే వెళుతున్నారని అన్నారు. ప్రస్తుత పిడిఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు ఉద్యమ అభ్యర్ధని ఉద్యోగ , ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్ సమస్యలతో పాటుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ , కార్మిక వర్గాల వారి సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుందని అన్నారు. మండలిలో మన పిడిఎఫ్ అభ్యర్థి ఉంటే మన సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన లేని అభ్యర్థుల్ని శాసనమండలికి పంపితే ఉపయోగం లేదని సమస్యలు పరిష్కారానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలన్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎం.హనుమంతరావు ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి హనుమంతరావు సరైన అభ్యర్థి అన్నారు. ఆయన గెలుపునకు బాపట్ల నుండి శ్రీకారం చుట్టాలన్నారు.

యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హనుమంతరావు పిడిఎఫ్ ఉద్యమ అభ్యర్థిగా హనుమంతరావును బలపరుద్దామన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన అనుభవాన్ని జోడించి మంచి సేవలు అందిస్తారన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పిడిఎఫ్ ఉద్యమ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సిఐటియు ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవాల దృష్ట్యా పాలకుపక్షాల దౌర్జన్యాలను ఎదుర్కొని పిడిఎఫ్ అభ్యర్థి ని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు ఒక ఉపాధ్యాయులే గాక రైతులు రైతు కూలీలు అంగన్వాడీలు ఆశలు ఇతర కార్మికుల ప్రయోజనాల కోసం కృషి చేసే పిడిఎఫ్ ఉద్యమ అభ్యర్థి ఎం.హనుమంతరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఉపాధ్యాయులుగా ప్రజాసంఘాలు కలిసికట్టుగా కృషి చేయాలి అన్నారు.

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం హనుమంతరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలలో ఎంతో అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఉద్యమస్ఫూర్తితో సమస్యలపై పోరాడుతానని తన గెలుపుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని హనుమంతరావు కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర యుటిఎఫ్ ప్రతినిధులు ప్రేమ్ కుమార్, పాపారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ బాబురావు, ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, జెవివి రామారావు, భాస్కరరావు, ప్రైవేట్ ఉపాధ్యాయ నాయకులు సూర్యారావు, యుటిఎఫ్ జిల్లా కమిటీ బాధ్యులు అడుగుల శ్రీనివాసరావు, రవిబాబు, సుబ్రహ్మణ్యం, ఎం.వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్స్ , ఆడిట్ కమిటీ కన్వీనర్ మద్దాల సురేష్, మండల, పట్టణ శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్