వి శ్రీనివాసరావు పిలుపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రజా పోరాట యోధులు, నిరంతర అధ్యయనశీలి, సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి సీతారాం ఏచూరి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు సాగిద్దామని రైతు సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వడ్డేశ్వరంలోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా సీతారాం ఏచూరి జయంతిని పురస్కరించుకొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గురువారం నివాళులర్పించారు. సమావేశానికి కంకణాల ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఏచూరి తన నిరంతర అధ్యయనంతో మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అవపోశన పట్టారని అన్నారు. సమాజంలో ఉన్న దోపిడీనీ, పీడనను రూపుమాపి సమసమాజ స్థాపనకు మార్క్సిజమే మార్గమని, ఆసిద్ధాంతాన్ని నమ్మి, ఆ మార్గం వైపు ప్రజలను నడిపించేం దుకు అనేక పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమ నేతగా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోరాటాల బాట పట్టిన ఆయన దేశ రాజకీయాలను సమగ్రంగా అర్థం చేసుకున్నారని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ఏచూరి దేశ రాజకీయాలను మలుపు తిప్పే అనేక నిర్ణయాలలో భాగస్వామిగా ఉన్నారని అన్నారు. దేశం మతోన్మాదం ప్రమాదంలో పడుతున్న దశలో ప్రత్యేకంగా లౌకిక పార్టీలను ఏకం చేయటంలో మతోన్మాద కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనే ఉద్యమాలు రూపొందించడంలో ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా దోపిడీ పాలకుల విధానాలను ప్రశ్నించడంలో, ప్రతిఘటించడంలో గొప్ప చతురతను ప్రదర్శించారన్నారు. యూపీఏ 1 ప్రభుత్వ కాలంలో ఉపాధి హామీ, సమాచార హక్కు, అటవీ హక్కులు లాంటి చట్టాలు రూపొందించడంలో ఏచూరి పాత్ర ముఖ్యమైనదని తెలిపారు. ఏచూరి జయంతి అయిన ఆగస్టు 12 నుండి ఆయన ప్రథమ వర్ధంతి అయిన సెప్టెంబర్ 12 వరకు నెల రోజులపాటు దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు జరుగుతున్నాయని ప్రజలు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏచూరి స్ఫూర్తితో సామాజిక సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధమవుదామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం పేర్కొన్నారు. సమాజం ఆధునిక యుగం లోకి చేరినా, అంతరిక్షంలో మానవులు సంచరిస్తున్నా, కుల వివక్షత నేటికీ కొనసాగటం సిగ్గుచేటన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా ఆ ఉద్యమ ఫలాలు అట్టడుగు ప్రజలకు నేటికీ అందలేదని అన్నారు. స్వాతంత్రోద్యమ లక్ష్యాలు సాధించే విధంగా ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి మాట్లాడుతూ.. వామపక్షాలు వ్యవసాయ కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందని తెలిపారు. ఆ చట్టం రూపొందించడంలో సీతారాం ఏచూరి పాత్ర ముఖ్యమైనదని గుర్తు చేశారు. స్వాతంత్ర్య అనంతరం పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ చట్టం అనేక విధాల దోహద పడిందన్నారు. మోడీ ప్రభుత్వం అమానుషంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి విబి గ్రామ్ జి అనే పేరుతో పేదల పొట్ట కొట్టే చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.








కామెంట్‌లు (0)