ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నకిలీ పత్రాలతో రూ.4 కోట్ల భూకబ్జా కుట్ర భగ్నం

8 గంటల క్రితం

SP PRESSMEET
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:33 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో సహా 13 మందిపై కేసు, 8 మంది అరెస్టు

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : నకిలీ మరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల విలువైన ఖాళీ స్థలాన్ని కాజేయాలని చూసిన ఓ భూకబ్జా ముఠా గుట్టును శ్రీకాకుళం రూరల్ పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ భూకుట్రకు సంబంధించి ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలోని సర్వే నంబర్ 35/13 (ప్లాట్ నంబర్లు 84, 85, 86) లో గల శ్రీ సత్య సాయి నగర్ లేఅవుట్‌లో ఫిర్యాదుదారుడైన కట్టా కనక లింగేశ్వరరావు తండ్రి 1988, 1992 సంవత్సరాల్లో చట్టబద్ధంగా సుమారు 900 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే, బాధితుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో నివసిస్తుండటంతో, ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉండటాన్ని గమనించిన నిందితులు దానిపై కన్నేశారు. ముందస్తు పథకం ప్రకారం ఆ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నారు.

బ్రతికుండగానే చంపేసి.. నకిలీ పత్రాల సృష్టి.!

ఆ స్థలానికి సంబంధించిన అసలు లింక్ డాక్యుమెంట్లను సేకరించిన నిందితులు, అసలు యజమాని అయిన అందవరపు గోవిందరాజులు బ్రతికి ఉన్నప్పటికీ.. ఆయన మరణించినట్లు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పేరిట ఒక నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. దాని ఆధారంగా శ్రీకాకుళం తహసీల్దార్ జారీ చేసినట్లుగా ఒక నకిలీ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాన్ని కూడా తయారు చేశారు. అందులో అడబాల @ అందవరపు రజిని అనే ఆమెను ఏకైక వారసురాలిగా చూపించారు. ఆపై మూడు నుంచి నాలుగు కోట్ల విలువైన ఆ స్థలాన్ని విక్రయించినట్లు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి, ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించారు. ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించగా, అసలు యజమాని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దాంతో నిందితులు వారిని బెదిరించడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.

రాజకీయ నాయకులు, అధికారుల హస్తం

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శ్రీకాకుళం రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ఈ కుట్రలో మొత్తం 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ నేర కుట్రలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (A6), తమ్మినేని వాణి (A7), తమ్మినేని వెంకట శ్రీరాములు చిరణ్జీవి నాగ @ నాని (A5) లు ఇతర నిందితులతో కుమ్మక్కై, దురుద్దేశపూర్వకంగా నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ వెల్లడించారు. అలాగే ప్రస్తుత హిరమండలం సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణ (A13) కూడా నిందితులకు సహకరిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేలా చూశారని ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి.

ఎనిమిది మంది అరెస్ట్.!

ఈ కేసులో ప్రధానంగా నకిలీ వారసురాలిగా నటించిన అడబాల@అందవరపు రజిని (A1), తెలుగు సతీష్ కుమార్ (A2), సాలిపిల్లి లక్ష్మణరావు (A3), ముదాడ్ల ఉపేంద్ర కుమార్ (A8), జెగురిపాటి ఉపేంద్ర రావు (A9), మామిడి గోపాలకృష్ణ (A10), సాంబాన సాంబశివరావు (A11), డాక్యుమెంట్ రైటర్ కూన పెద్దిరాజు (A12) లతో కలిపి మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నకిలీ రబ్బరు స్టాంపులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లా ఎస్పీ హెచ్చరిక..

ప్రజలు భూములు, స్థలాలు కొనుగోలు చేసే ముందు సంబంధిత భూ రికార్డులు, యాజమాన్య పత్రాలు, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు మరియు రిజిస్ట్రేషన్ వివరాలను ప్రభుత్వ శాఖల ద్వారా ఖచ్చితంగా పరిశీలించుకోవాలని ఎస్పీ సూచించారు. నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేస్తూ భూకబ్జాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, అత్యంత చాకచక్యంగా ఈ కేసును ఛేదించిన ఎస్డీపీవో వివేకానంద, రూరల్ సీఐ పైడపు నాయుడు, రూరల్ ఎస్ఐ సురేష్, ఆమదాలవలస ఎస్ఐ బాలరాజు, వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణలను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు..

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్