- ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పేరుతో ఆత్మకథ
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రచించిన ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పేరుతో కోవింద్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో తన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజా జీవితంలో సాగించిన ప్రస్థానంతో పాటు తన అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రామ్‌నాథ్ కోవింద్ జీవితాన్ని కొనియాడారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ సాధారణ పౌరుడి స్థాయి నుంచి దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ ఎదిగే అవకాశాలను కల్పిస్తుందనే విషయానికి కోవింద్ జీవితం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజాసేవలో రామ్‌నాథ్ కోవింద్ చూపించిన వినయం, క్రమశిక్షణ, విలువలు నేటి యువతకు ఆదర్శమని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగ విలువలకు కోవింద్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తినిస్తూ.. కష్టాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదగాలనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ అనే పేరును కోవింద్ తన ఆత్మకథకు ఎంచుకోవడం ఎంతో సముచితమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అనుభవాలు, జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలు, ప్రజా జీవితంలో తన ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను కోవింద్ ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు.








కామెంట్‌లు (0)