- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డ్వాక్రా సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎస్‌ఎంఇ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పిఎంఎఫ్‌ఎంఇ) పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రు. 3 లక్షల వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చని, దీనికి పిఎంఎఫ్‌ఎంఇ పథకం కింద లభించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఈ పథకంలో మహిళలు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని, జిల్లా సమాఖ్యలు ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో ఎంపికైన మహిళలకు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం తరపున కల్పిస్తామని వెల్లడించారు. మహిళలకు కేవలం రుణం ఇవ్వడమే కాకుండా, వారి వ్యాపారం విజయవంతం అయ్యే వరకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా తయారు కావడంతో పాటు ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం అభివృద్దితో పాటు పలువురికి ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.








కామెంట్‌లు (0)