మూడు రోజుల మహాసభకు ముస్తాబైన కర్నూలు
ప్రతినిధుల సభ, వీధి నాటకోత్సవాలు
హాజరుకానున్న సినీ ప్రముఖులు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : ప్రజా నాట్యమండలి (పిఎన్ఎం) రాష్ట్ర 11వ మహాసభకు కర్నూలు నగరం ముస్తాబైంది. శనివారం నుంచి మూడు రోజుల పాటు మహాసభ జరగనుంది. రాజ్ విహార్ కూడలి, కలెక్టరేట్ కూడలి, సుందరయ్య కూడళ్లను జెండాలు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. ర్యాలీ సాగే మార్గమంతా తోరణాలు రెపరెపలాడుతున్నాయి. బస్టాండ్ నుంచి ప్రతినిధుల సభ ప్రాంగణానికి వెళ్లే మార్గాన్ని తోరణాలతో అలంకరించారు. హాజరయ్యే ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభతో పాటు వీధి నాటకోత్సవాలను నిర్వహించనున్నారు. వీటికి సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. మొదటి రోజు శనివారం ఉదయం పది గంటలకు కర్నూలు డైమండ్ ఫంక్షన్ హాల్లోని జి.సన్యాసిరావు, కె.పెంచలయ్య నగర్‌లో ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహితీవేత్త తెలకపల్లి రవి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి కార్యదర్శి కట్టా నరసింహ, నటి విజయలక్ష్మి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జి.పుల్లయ్య, గౌరవాధ్యక్షులు కెవి.సుబ్బారెడ్డి, డాక్టర్ బి.శంకర శర్మ హాజరుకానున్నారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటలకు వై జంక్షన్ నుంచి మార్కెట్ యార్డు వరకూ కళాకారులు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం మార్కెట్ యార్డులోని సఫ్దర్ హష్మీ ఓపెన్ థియేటర్ (షార్ట్)లోని గాదె సుబ్బారెడ్డి కళా ప్రాంగణంలో సాయంత్రం వీధి నాటకోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంకురం సినిమా దర్శకులు సి.ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మూడు నాటికలతో పాటు నృత్య రూపకాలు ప్రదర్శించనున్నారు. ఈ కళా వేదికపై మూడు రోజుల పాటు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ వీధి నాటకోత్సవాలు జరగనున్నాయి. రెండో రోజు నాటకోత్సవాలకు సినీ దర్శకులు బాబ్జీ, మూడో రోజు నాటకోత్సవాలకు ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరుకానున్నారు. మూడో రోజు వీధి నాటకోత్సవాలతో మహాసభ ముగియనుంది. ప్రతినిధుల సభలో కళాకారుల సమస్యలు, సమాజంలో గంజాయి దుష్పరిణామాలు, సంస్కృతికి సంబంధించి చర్చలు జరిపి పలు తీర్మానాలు చేయనున్నారు.
ప్రదర్శనను జయప్రదం చేయండి : పిఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్
రాష్ట్ర వీధి నాటకోత్సవాలు (షాట్-2026), పిఎన్ఎం రాష్ట్ర 11వ మహాసభను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్ కోరారు. కర్నూలు కెకె భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వీధి నాటకోత్సవాలలో వేమన, అల్లూరి సీతారామరాజు, పోతులూరి వీర బ్రహ్మం నాటికలు సామాజిక సందేశాల నాటికలు, జానపద పాటలు, బుర్రకథలు, వీధి నాటకాలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు శ్రమజీవుల జీవితాలు, రైతుల సమస్యలు, కులవివక్ష వ్యతిరేకత, మత సామరస్యం, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక కళారూపాలు ఉంటాయన్నారు. పిఎన్ఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.రమణ, పిఎన్ఎం రిసోర్స్ కన్వీనర్ కవి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఈ నాగరాజు, కార్యదర్శి ఆనంద్ బాబు, గౌరవ అధ్యక్షులు నోమేశ్వరి పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)