బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపునరావాస సమస్యపై పోలవరం నిర్వాసితుల ధర్నా

1 గంట క్రితం

1788341811224.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- చింతూరు (పోలవరం జిల్లా) : పునరావాస సమస్యపై పోలవరం జిల్లా విఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులు బుధవారం చింతూరు ఐటిడిఎ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమకు కొత్తపల్లిలో పునరావాసం వద్దంటూ పెద్దపెట్టున నినదించారు. తమకు ఇష్టం లేని ప్రాంతంలో పునరావాసం కల్పించొద్దని, తమ జీవన విధానానికి అనుకూలమైన ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. సుమారు 400 మందికిపైగా నిర్వాసితులు ఫ్లెక్సీలు, ప్లకార్డులు చేతబట్టి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ‘మునిగేది మా ఇళ్లు... మా పొలాలే కాదు మా భవిష్యత్తు’ అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి ప్రాంతంలో తమకు వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండవని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలకు తాడువాయిలో పునరావాసం కల్పిస్తూ, తమను మాత్రం దూర ప్రాంతానికి తరలించడం దారుణమన్నారు. కొత్త ప్రాంతంలో జీవనం సాగించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులందరికీ ఒకే చోట పునరావాసం కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం ఐటిడిఎ ప్రాంగణంలోకి నిర్వాసితులు చొచ్చుకెళ్లారు. పిఒ ఛాంబర్‌ వద్దకు చేరుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన విషయం తెలుసుకున్న చింతూరు ఐటిడిఎ పిఒ, ఆర్‌అండ్‌ఆర్‌ అధికారి శుభం నొక్వాల్‌, ఎఎస్‌‌పి బొడ్డు హేమంత్‌ అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభ్యంతరాలను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో, నిర్వాసితులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. తమకు అనుకూలమైన ప్రాంతంలో పునరావాసం కల్పించకుంటే మళ్లీ ఆందోళనను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

1788341811189.jpg


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్