- విద్యార్థినులను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడాన్ని ఖండించిన ఐద్వా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : న్యాయమైన డిమాండ్ల సాధనకు శాంతియుతంగా ఆందోళన, ర్యాలీ నిర్వహిస్తున్న పారామెడికల్ విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించడం దుర్మార్గమని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఎపి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా విద్యార్థినులను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం అత్యంత అమానుషమైన, సిగ్గుచేటైన చర్య అని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు వారిపై దౌర్జన్యానికి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పారామెడికల్ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పారామెడికల్ విద్యార్థులు చేస్తున్న రూ.15 వేల స్టైపెండ్ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారి ఆందోళనను అణచివేసేందుకు పోలీసు బలాన్ని ప్రయోగించడం సరికాదని హితవు పలికారు. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.విద్యార్థినుల పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారామెడికల్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)