లోకేష్‌ను కలవనీయకుండా అడ్డుకున్న పోలీసులు
దుస్తులు చిరిగేలా ఈడ్చిపడేసిన వైనం
మంత్రి హామీతో దీక్షలు తాత్కాలిక విరమణ
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : సబ్సిడీ బకాయిల మంజూరు కోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ వద్ద గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తలపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆత్మకూరు పరిధిలోని సికె కన్వెన్షన్‌లో మంత్రి లోకేష్‌ను కలిసేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామిక వేత్తలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త భారోత్ రమేష్‌ను పోలీసులు పట్టుకుని వాహనం ఎక్కించే క్రమంలో తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగింది. ఆయన ఈడ్చుకెళ్లడంతో దుస్తులు చిరిగిపోయినప్పటికీ, పోలీసులు బలవంతంగా వాహనంలోకి నెట్టి తరలించారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు నెట్టివేయడంతో మహిళా పారిశ్రామికవేత్త సత్యనారాయణమ్మ స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల తీరును చిత్రీకరిస్తున్న తోటి పారిశ్రామిక వేత్తల సెల్‌ఫోన్‌లు లాక్కొన్ని పోలీసులు నానా హైరానా సృష్టించారు. పరిస్థితి చేజారిపోతుందనుకున్న అధికారులు వెంటనే లోకేష్ ఒఎస్‌డికి సమాచారమిచ్చారు. ఆయన లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఐదుగురిని కలిసేందుకు లోకేష్ అనుమతించారు. రూ. 780 కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల 8500 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తలు ఆయనకు వివరించారు. సమస్యలను రెండు నెలలోపు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో నిరాహార దీక్షలను వారు తాత్కాలికంగా విరమించారు. రెండు నెలల తర్వాత సబ్సిడీ బకాయిలు నిధులు విడుదల కాకపోతే ఈసారి ఉద్యమం తీవ్రం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.బాబు హెచ్చరించారు.








కామెంట్‌లు (0)