బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచట్టానికి లోబడే పోలీసులు పనిచేయాలి : హైకోర్టు

6 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో పోలీసులు చట్ట నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలని, వారికి నచ్చినట్లు లా అండ్ ఆర్డర్ నిర్వహించే పరిస్థితి ఉండకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత గతంలో నమోదైన కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలు మార్చి నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పోలీసులు తలచుకుంటే ఏదైనా సృష్టించగలరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మాజీ స్పీకరు, వైసిపి నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్‌ చిరంజీవి నాగ్‌పై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కుమారుడి పేరుతో ఉంటే తల్లిదండ్రులను ఎందుకు నిందితులుగా చేర్చారని పోలీసులను ప్రశ్నించిన కోర్టు, మిగిలిన కుటుంబ సభ్యులను కూడా చేర్చాల్సిందేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమినట్లు కనిపిస్తోందని పేర్కొంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులతో పాటు ఫిర్యాదుదారునికి ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న తమ్మినేని కుటుంబం విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు, క్వాష్ పిటిషన్‌లో అలాంటి రక్షణ ఇవ్వలేమని, అవసరమైతే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. కట్టా జయకిషోర్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును రద్దు చేయాలని తమ్మినేని కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా, తమ కుమారుడు రజిని అనే మహిళ నుంచి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశారని, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు. దీనికి ప్రతిగా నకిలీ పత్రాలతో విలువైన ఆస్తిని కాజేయడానికి కుట్ర జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ సందర్భంగా భూమి కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల ఆధారాలు సమర్పించాలని, చెక్కు ద్వారా చెల్లించారా, నగదుగా ఇచ్చారా అనే వివరాలను రికార్డులతో చూపాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్