మాజీ మంత్రి ఆర్‌కె రోజా
ప్రజాశక్తి- విజయపురం (చిత్తూరు జిల్లా) : మాజీ మంత్రి, వైసిపి నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, పార్టీ నాయకుల కుటుంబ మహిళలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలను నిరసిస్తూ ఆ పత్రిక ప్రతులను దహనం చేసిన ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందన్నారు. ఆ హక్కునూ అణచివేసే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసి వేధించడం టిడిపి కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి రాజకీయ కక్షసాధింపుతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు వైసిపి భయపడదని, ప్రజల సమస్యలపై తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, రాజకీయ వేధింపులకు స్వస్తి పలకాలని రోజా డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)