శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజకీయాలు వ్యాపారమయం

1 గంట క్రితం

medacacl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి. రమేష్

- పంటలకు దక్కని మద్దతు ధర : లక్ష్మణరావు

ప్రజాశక్తి -గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వ్యాపారమయంగా మారాయని, అవినీతి పరాకాష్టకు చేరిందని, రాష్ట్ర అప్పులు స్థూల ఉత్పత్తిలో 80 శాతానికి చేరాయని ఎపి ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి. రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యామ్నాయం అవసరమా?’ అనే అంశంపై గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో శనివారం జరిగిన చర్చా గోష్టిలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా ప్రజలను చీల్చి పాలన సాగిస్తున్న ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం అవసరమన్నారు. రాష్ట్రంలోని 123 పట్టణాల్లో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థలు లేవని, ప్రధాన మీడియా, దినపత్రికలు పార్టీల కరపత్రాలుగా మారిపోగా, కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు సైతం రాజకీయ రంగు పూసుకుని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు సహజ వనరులను ధారాదత్తం చేస్తున్నారని, ఇసుక, మైనింగ్, భూకబ్జాలతో ఎమ్మెల్యేలు అక్రమార్జనకు పాల్పడుతున్నారని విమర్శించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం పౌర సమాజాన్ని సంఘటిత పరుస్తున్నామని తెలిపారు. అక్షరాస్యతలో 36వ స్థానం, దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం కలిగి‌న రాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్‌ ఉండటం శోచనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర లభించడం లేదని, ప్రజా సమస్యలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం, రమేష్ పట్నాయక్, ప్రజా గాయకుడు గని తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్