- అసంఘటిత రంగంపై కూడా..
- 12 మందితో కమిటీ ఏర్పాటు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, అసంఘటిత వార్షిక సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 28 జిల్లాల్లో జిల్లా స్థాయిలో ఈ సర్వేలను నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ, నమూనా రూపకల్పన, ప్రశ్నావళి, డేటా సేకరణ, గణాంకాల అంచనా తదితర అంశాలపై రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ, జాతీయ నమూనా సర్వే కార్యాలయం మార్గదర్శకత్వంలో ఈ సర్వేలు నిర్వహించనున్నారు. కార్మిక శక్తి భాగస్వామ్యం, అసంఘటిత రంగ సంస్థలకు సంబంధించిన విశ్వసనీయమైన జిల్లా స్థాయి గణాంకాలను రూపొందించడం ఈ సర్వేల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ప్రణాళికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ విధానాలు, కాలపట్టికలు, ఆర్థికపరమైన అంశాలను ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్లానింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి కమిటీకి ఛైర్మన్‌గా, ఆర్థిక గణాంకాల డైరెక్టరేట్ డైరెక్టర్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సర్వేల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అంచనాలు, నివేదికలు రూపొందించేందుకు అవసరమైన గణాంక పద్ధతులను కూడా కమిటీ ఖరారు చేయనుంది. సర్వే ఫలితాల వివరాలు, ధ్రువీకరణ, విశ్లేషణ, ప్రచురణను నిర్దేశిత ప్రమాణాలు, మార్గదర్శకాలకనుగుణంగా చేపట్టాల్సి ఉంటుంది.








కామెంట్‌లు (0)