- కృష్ణమూర్తి, సుర్జీత్ వర్ధంతి సభలో ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి వెంకట్
- బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10న జైల్‌భరో
ప్రజాశక్తి -తాడేపల్లి (గుంటూరు జిల్లా) : భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా అశువులు బాసిన అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ఉన్న కెబి భవన్ (ప్రజా సంఘాల కార్యాలయం)లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణమూర్తి, హరికిషన్ సుర్జీత్ వర్ధంతి కార్యక్రమాన్ని ఎపి వ్యకాస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకట్ ప్రసంగించారు. ముందుగా సూర్జీత్, కృష్ణమూర్తి చిత్రపటాలకు నాయకులు నివాళులర్పించారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ... దున్నేవాడికి భూమి దక్కాలని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కృష్ణమూర్తి... వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా నాయకుడిగా పనిచేశారని గుర్తు చేశారు. ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించిన ఆయన ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైనా ఆనాటి కాంగ్రెస్ పాలకుల నిరంకుశ వైఖరులకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు సుర్జీత్ అని కొనియాడారు. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో శ్రామికులను సంఘటితపరిచి, గ్రామీణ ధనిక వర్గాన్ని ఓడించాలన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సిజెపి విద్యార్థుల పోరాటం, ఫాసిస్ట్ నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలకు నాంది పలికిందని గుర్తు చేశారు. ప్రతి పేద కుటుంబానికి రెండు ఎకరాల భూమి, కౌలుదారులకు హక్కు, కూలి రెట్లు పెంపుదల, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. బిజెపి అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు పదిన ఎపి, రైతు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే జైలుభరో కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, సీనియర్ నాయకులు వై కేశవరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శివ నాగరాణి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె ఆంజనేయులు, కళ్యాణ్ కుమార్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు అశోక్, ఐద్వా రాష్ట్ర నాయకులు రమాదేవి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.








కామెంట్‌లు (0)