- నేరుగా భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోడి
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు ఒకటో తేదీన జరిగే ఈ కార్యక్రమానికి అదే రోజు నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారని రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం చేరుకుంటారు. 10.45 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం కారులో 10.55 గంటలకు ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. అక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 11 గంటల నుంచి 11.15 వరకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఓపెన్‌టాప్ జీప్‌లో 11.25 గంటలకు బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. 11.30 నుంచి 12.55 వరకు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని, అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమవుతారు. మొత్తం పర్యటన వ్యవధి సుమారు 2 గంటల 25 నిమిషాలు ఉండనుంది.








కామెంట్‌లు (0)